కృష్ణాజిల్లాలో
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నార్సీ బిల్లుకు వ్యతిరేకంగా కృష్ణాజిల్లా గుడివాడలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు పట్టుకుని... మహిళలు, చిన్నారులు ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, హిందూ ముస్లిం భాయి భాయి అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎన్నార్సీ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లాలో
విశాఖ నగరంలో ముస్లింలు, వామపక్షాలు సంయుక్తంగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాయి. వందలాది మంది జాతీయ పతాకాన్ని పట్టుకుని రాజ్యాంగ పరిరక్షణ జరగాలని సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగం పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎన్నార్సీకి వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సెంటర్ నుండి బంగ్లా రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేశారు.
నెల్లూరు జిల్లాలో
ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రజలపై రుద్దడం సరికాదంటూ నెల్లూరు జిల్లాలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో 600 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నార్సీ, సీఏఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గ్రామ సచివాలయాల్లో 470 సేవలు