కృష్ణా జిల్లా నందిగామ స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర శనివారం కొండముచ్చులు ఇళ్లపై నుంచి దూకేస్తూ.. గోడలు పాకేస్తూ.. స్తంభాలు ఎక్కేస్తూ గుంపుగా వెళ్తున్నాయి. అంతలో ఓ బుజ్జి కొండముచ్చు విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. విద్యుదాఘాతానికి గురై విలవిలలాడుతోంది. బిడ్డను కాపాడుకోవాలని తల్లి ఎంతో తపించింది. కష్టపడి కింది నుంచి లాగేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. కిందకు దిగి దీనంగా, ఆవేదనగా కూర్చుంది.
పరిమళించిన మానవత్వం
అంతలో స్థానికులు గమనించి, విద్యుత్తు ఉద్యోగులకు సమాచారం అందించారు. సీపీడీసీఎల్ పట్టణ ఏఈ దిబ్బయ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అతికష్టం మీద పిల్ల కొండముచ్చును కాపాడారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన దానిని పశువైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే ఇంజక్షన్లు చేసి చికిత్స అందించారు. తేరుకున్న పిల్లను తీసుకొచ్చి గుంపులో కలిపారు. అప్పటిదాకా అక్కడే గోడపై కూర్చుని ఆవేదనతో ఎదురుచూసిన తల్లిలో కొండంత ఆనందం. వెంటనే వచ్చి బిడ్డను తనివితీరా గుండెలకు హత్తుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికుల కళ్లలో సంతోషం వెల్లివిరిసింది.
ఇవీ చదవండి.. బార్బిక్యూ రైడ్...ఆహార ప్రియులకు ఓ సరికొత్త ట్రెండ్