minister suresh on midday meal scheme: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చే చిక్కి కోసం రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గ్లోబల్ టెండర్ ప్రకారం వీటి సరఫరా జరుగుతోందని.. వీటిపై తెదేపా నేతలు ఆరోపణలు చేయడం సహేతుకం కాదన్నారు. నాణ్యతను కూడా టాటా కన్సల్టెన్సీ లాంటి ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. రేటు విషయంలోనూ తెలుగుదేశం పొరపాటు పడుతోందన్నారు. 2021-22లో అదనంగా 7 లక్షల మంది విద్యార్థులు పెరిగారని చెప్పారు.
అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదు...
కొవిడ్ జాగ్రత్తలో భాగంగా ప్రతీ విద్యార్థికి 25 గ్రాముల చిక్కి ప్యాకెట్ ను వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు మంత్రి సురేశ్ వివరించారు. ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదనే విషయాలను ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని హితవు పలికారు. తెదేపా హయాంలో నీళ్ల సాంబారు, చిన్న సైజు గుడ్లు సరఫరా చేశారని విమర్శించారు. వారి పాలనలో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో గుడ్ల సరఫరాకు 50 చోట్ల టెండర్లు పిలిచామన్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరే సరఫరా చేశారని పేర్కొన్నారు. గతంలో చాలాసార్లు పాఠశాలలకు గుడ్లు సరఫరా చేయలేదని దుయ్యబట్టారు.
"గ్లోబల్ టెండర్ ప్రకారం విద్యార్థులకు చిక్కీ సరఫరా. టాటా కన్సల్టెన్సీ ద్వారా నాణ్యత తనిఖీ చేయించి టెండర్లు ఇచ్చాం. ప్రతి విద్యార్థికి 25 గ్రాముల చిక్కి ప్యాకెట్ ఇస్తున్నాం. ఎవరికీ అక్రమంగా టెండర్లు కట్టబెట్టలేదు" - మంత్రి సురేశ్
చర్చలతోనే పరిష్కారం...
పీఆర్సీ అంశంపై మంత్రి సురేశ్ స్పందించారు. ఈ విషయంలో ముందుకే వెళ్ళాలని, గడియారం వెనక్కు తిరగడం కుదరదని గుర్తించాలని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కారమవుతుందని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి