శ్రీకాకుళం జిల్లాలో...
వ్యవసాయ చట్టాలకు నిరసనగా పాలకొండలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ చట్టాల ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని, వెంటనే వీటిని రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో...
జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని ఆందోళనకారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చల్లపల్లి అంబేడ్కర్ విగ్రహం ఎదుట సీపీఎం నేతలు నిరసన చేశారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలులో వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఏం.ఏ.గఫర్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నంద్యాలలో వామపక్షాల నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేశారు.
విజయనగరం జిల్లాలో...
రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... విజయనగరం కలెక్టరేట్ వద్ద మూడు రోజులపాటు నిరసన దీక్ష చేపడుతున్నట్లు వామపక్ష నేతలు తెలిపారు. అన్నదాతలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో...
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గుంటూరులో వామపక్ష పార్టీల నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మూడు రోజులు పాటు ఈ ఆందోళనలు కొనసాగుతాయని నిరసనకారులు తెలిపారు.
విశాఖపట్నం జిల్లాలో...
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ... వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారి కూడలి వద్ద నిరసన చేపట్టారు. దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం, రైతు, గిరిజన ప్రజా సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: