కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ధర్నాలు చేపట్టాయి. సామాన్యుడి నడ్డివిరిచేలా కేంద్రం ధరలు పెంచి భారం మోపుతోందని నిరసన తెలిపారు.
- విశాఖ జిల్లా
కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు తెలిపాయి. చోడవరంలో ధర్నా చేశాయి. వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ సచివాలయాల వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఇంధన ధరలు పెంపునకు వ్యతిరేకంగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష నాయకులు నినాదాలు చేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారులను దిగ్బంధించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. తగరపువలసలో సీపీఎం కార్యాలయం నుంచి ఫ్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ స్థానిక సచివాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో వుడ్ పేట సచివాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖ హెచ్‌బీ కాలనీ వార్డు సచివాలయం ఎదుట సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీజిల్, నిత్యావసర ధరలు పెంచి, పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపిందని ఆరోపించారు.
- అనంతపురం జిల్లా…
అనంతపురం జిల్లాలో పెంచిన పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలంటూ వామపక్షాలు ఆందోళన చేశాయి. సీపీఐ, సీపీఎం సహా వామపక్ష పార్టీలు నగరంలో నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయదుర్గం పట్టణంలోనూ, కనేకల్ మండల కేంద్రంలోనూ సీపీఎం, సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. నార్పల మండలాల్లో ఆటోలను తాడుతో కట్టి లాగుతూ నిరసన తెలిపారు.
కళ్యాణదుర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ విధించాలని నినాదాలు చేశారు. సామాన్యుడి నడ్డివిరిచే పెట్రో ధరల పెంపును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గుంతకల్లు మునిసిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, సీపీఎం న్యూ డెమోక్రసీ పార్టీలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- గుంటూరు జిల్లా…
గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి.. సచివాలయ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
- చిత్తూరు జిల్లా...
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. మదనపల్లెలో మార్కెట్ యార్డ్ ఎదుట ఆందోళన చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు, బీ.కొత్తకోట మండల కేంద్రాల్లో మంగళవారం వామపక్షాల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా జాలి చూపించలేదని, అన్ని విధాలుగా ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించక పోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
- ప్రకాశం జిల్లా…
కేంద్రప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని పోత్సహించటం వల్లే దేశంలో ధరలకు రెక్కలొచ్చాయని ప్రకాశం జిల్లా చీరాల సీపీఎం కార్యదర్శి బాబురావు అన్నారు. పెట్రో ధరాలపెంపును నిరసిస్తూ... చీరాలలోని వార్డు సచివాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, సామాన్య ప్రజలకు పెను భారంగా మరిందని ప్రకాశం జిల్లా ఒంగోలు లో వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.. సుందరయ్య భవన్లో నిరసన తెలిపారు.
కనిగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన వీధులలో ఆటోని తాళ్లతో కట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ సింగారావుకి వినతిపత్రం అందజేశారు. అద్దంకిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
- శ్రీకాకుళం జిల్లా…
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. నరసన్నపేట మారుతీ నగర్ కూడలి నుంచి పెట్రోల్ బంక్ వరకు సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
- నెల్లూరు జిల్లా…
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పంచాయతీ బస్టాండ్ కూడలిలో రోడ్డుపై జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
- కృష్ణా జిల్లా…
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డిజిల్ ధరలకు నిరసనగా కృష్ణా జిల్లా విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో వామపక్ష పార్టీల ఆందోళన చేశాయి. ద్విచక్రవాహనాలకు తాళ్లు కట్టి వినూత్న నిరసన తెలిపారు.
- కడప జిల్లా…
పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని కడప జిల్లా వ్యాప్తంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ధర్నాలు చేశారు. జమ్మలమడుగు పాత బస్టాండ్ సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఆటోకి తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు.
రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో వామపక్షాలు నిరసన చేపట్టారు. గత నెల రోజుల్లో ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయని, దీనివల్ల రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోందని, కార్మిక రంగం వీధిన పడుతోందని తెలిపారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మైదుకూరులో సీపీఐ నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం ధర్నా చేశారు. 40 రోజుల్లోనే 10 సార్లు ధర పెంచడం శోచనీయమన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండు చేశారు.
- కర్నూలు జిల్లా…
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని కర్నూలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా చేశాయి. ధరలు తగ్గించని పక్షంలో ఉద్యమం చేపడతామన్నారు.
- పశ్చిమగోదావరి జిల్లా…
పశ్చిమగోదావరి జిల్లాలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.
ఇవీ చదవండి: కొత్త 108, 104 వాహనాలను రేపు ప్రారంభించనున్న సీఎం