Chandrababu on PM Modi Leadership : ఎన్డీయే ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. తనపై అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారని పేర్కొన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించినట్లు వివరించారు. 45 ఏళ్లపాటు ఎన్నో ప్రజాప్రయోజన విధానాలు తెచ్చానని గుర్తు చేశారు. దిల్లీలో ఏర్పాటు చేసిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
'ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు భారత్ బ్రాండ్ చాలా బలంగా ఉంది. బ్రాండ్ బలంగా ఉంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. మోదీ స్థిరమైన ప్రయత్నంతో దేశాన్ని బాగా అభివృద్ధి చేశారు. అన్ని దేశాల్లో వృద్ధి నామమాత్రంగా ఉంది. భారత్ మాత్రమే 7.85 వృద్ధి రేటు సాధిస్తుంది. మనమంతా కలిసి పనిచేస్తే 10 శాతం పైగా వృద్ధి సాధించవచ్చనే నమ్మకం నాకు ఉంది. ఎన్నో పబ్లిక్ పాలసీలను నేను తీసుకొచ్చా. ఎవరూ తప్పు ఎత్తి చూపలేకపోయారు. కొంతమంది కోర్టుకెళ్లినప్పటికీ ఆరోపణలను నిరూపించలేకపోయారు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"ఎలాంటి కేసు లేకుండా నన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత నోటీసు ఇచ్చారు. నా జీవితంలో ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగింది. నేనే తప్పు చేయలేదు. అది నిరూపితమవుతుంది. కాబట్టి నేను ధైర్యంగా ఉండాలి జైల్లో ఉన్న 53 రోజులు అనుకున్నా. ఆంధ్రలోనే కాకుండా 80 దేశాల్లో 53 రోజుల పాటు నిరసనలు చేసి నాకు మద్దతుగా నిలిచారు. మనం చనిపోయినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ నా జైలు జీవితం సమయంలో ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలిచారు. అది నాకు చాలా మంచి అనుభవం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
HTLS 2024 in Delhi : గత సర్కార్‌పై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. అప్పుడు పవన్ కల్యాణ్ ముందుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో పొత్తు ప్రకటించారని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ కూటమి గెలిచిందని వెల్లడించారు. ఒకే సర్కార్ కొనసాగితే మరింత వేగంగా అభివృద్ధి ఉంటుదని పేర్కొన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేసేలా తమ పరిపాలన ఉంటుందని అందుకోసం కలిసి పని చేస్తామని చంద్రబాబు వివరించారు.
'కూటమి ప్రభుత్వంలో నాయకులకు వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం కూర్చుని మాట్లాడుకుంటే అవి సద్దుమణుగుతాయి. అదే మేము చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మేము కలిసి ఉంటాం, కలిసి పనిచేస్తామనే నమ్మకం నాకు ఉంది. పవన్ కల్యాణ్‌తో సోషల్ మీడియాకి సంబంధించి చిన్న సమస్య వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణం. మహిళలపైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు తల్లి, చెల్లిపైనా కూడా పార్టీ కార్యకర్తలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కానీ వాటన్నింటినీ వాళ్లు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఏమనాలని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవద్దా? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్‌గా మోదీ- ఐదో ప్లేస్‌లో చంద్రబాబు- సీఎం జాబితాలో టాప్ కూడా ఆయనే