SIT Inquiry on Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై క్షేత్రస్థాయిలో దర్యాప్తునకు సిట్ బృందం సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా తాజాగా బృందానికి సహాయ సహకారాలు అందించేందుకు మరో 30 మంది అధికారులను తీసుకున్నారు. దర్యాప్తును పూర్తిగా తిరుపతి నుంచి చేపట్టేందుకు అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అతిథి గృహాన్ని కేటాయించాల్సిందిగా టీటీడీని కోరారు.
నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్‍డీడీబీ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్ దర్యాప్తు చేయనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ నుంచి ఇద్దరు అధికారులతో పాటు రాష్ట్రం నుంచి ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరో అధికారి ప్రత్యేక బృందంలో నియమితులయ్యారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ ఉన్నారు. సీబీఐ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి రాంబాతో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (నాణ్యత హామీ) సలహాదారు డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా ఉన్నారు.
సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ సిట్ పని చేయనుంది. వీరంతా తిరుమలకు వచ్చి మొత్తం అక్రమాలను నిగ్గు తేల్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. మొత్తం నలుగురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, ఇద్దరు ఎస్సైల సేవలను సిట్ వినియోగించుకోనుంది. వీరితో పాటు మరికొంత మంది మినిస్టీరియల్ సిబ్బంది అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరింది. సిట్ కోరిక మేరకు సర్కార్ సిబ్బందిని కేటాయించనుంది.
రంగంలోకి దిగేందుకు సిద్ధమైన సిట్ బృందం : సిట్ బృందం సభ్యులకు వసతితో పాటు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీబీఐ అధికారులు టీటీడీని కోరారు. కంప్యూటర్లతో పాటు ప్రింటర్లు, రికార్డులు భద్రపర్చుకునేందుకు అవసరమైన ప్రత్యేక గది, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకునేందుకు అనుగుణంగా భవనాలను కేటాయించాలని టీటీడీని సీబీఐ కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు కార్యాలయం నుంచే సిట్ తమ విచారణ నిర్వహించనుంది. కార్యాలయానికి భవనాలను కేటాయించాలని కోరుతూ టీటీడీకి సీబీఐ లేఖ రాయడంతో అధికారులు కార్యాలయ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా సిట్ అధికారులు త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.