కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు రూ. 200 కోట్ల చొప్పున చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు కృష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డులు లేఖ రాశాయి. కృష్ణా గోదావరి, నదులపై ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. ఈ బోర్డులకు రెండు రాష్ట్రాలు 2 వందల కోట్ల చొప్పున చెల్లించాల్సిందిగా పేర్కోంది. ప్రాజెక్టుల నిర్వహణతో పాటు వివిధ ఖర్చుల నిమిత్తం కృష్ణా నదీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు వేర్వేరుగా రెండేసి వందల కోట్ల రూపాయల చొప్పున ఆయా బోర్డులు కోరిన 60 రోజుల్లోగా చెల్లించాలని కేంద్రం సూచించింది. అక్టోబరు 16 తేదీ నుంచి ఈ బోర్డుల ఆధీనంలోకి రెండు నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు రానుండటంతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యదర్శులు ఏపీ సీఎస్ కు ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా లేఖలు రాశారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు
దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకొనే అవకాశం లేదు. కానీ ఈ రెండు బోర్డులకు చర్యలు తీసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. తాజాగా కేంద్రం ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను, దీనికి ఆధారంగా తీసుకొన్న ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
కృష్ణా నదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులను రెండు బోర్డుల పరిధుల్లోకి చేర్చింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ వివరాలు పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు 2014లో కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి. వీటి పరిధిని కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంది. దీనిపై పలు దఫాలు చర్చలు జరిగాయి. కేంద్రానికి బోర్డులు ముసాయిదాలను పంపించాయి. అయితే ప్రాజెక్టులవారీగా కేటాయింపులు లేకుండా పరిధిని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించిన తెలంగాణ.. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే చేయాలని కోరగా, బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. దీనిపై చివరిసారిగా గత ఏడాది అక్టోబరులో కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఇద్దరు సీఎంల అభిప్రాయాల తర్వాత, బోర్డుల పరిధులపై తామే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండకూడదని అందులో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:
CM JAGAN CASES: 'సీబీఐ కేసులతో సంబంధం లేకుండా విచారించొచ్చు'