నీట్ పరీక్షలో అర్హత సాధించకపోయినా.. ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ పలు దఫాలుగా 15 లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాళ్లను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి.. మచిలీపట్నానికి చెందిన కట్టా నాగమోహనరావు అనే వ్యక్తి దగ్గర లక్షల సొమ్ము వసూలు చేశారు కేటుగాళ్లు. వారు చెప్పిన కాలేజీకి వెళ్లిన తర్వాత తాము మోసపోయామని గ్రహించి నాగమోహనరావు, అతని కొడుకు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తరచూ సందేశాలు
మచిలీపట్నానికి చెందిన కట్టా నాగమోహనరావు, ఆయన కుమారుడికి బీహర్‌కు చెందిన ముఠా..మెడికల్ సీటు ఇప్పిస్తామని తరచూ సందేశాలు పంపేవారు. ఈ క్రమంలోనే నిందితుడు పంకజ్ కుమార్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. కలకత్తా వైద్య కళాశాలలో ఉప కార్యదర్శిగా పని చేస్తున్నట్టు నమ్మించాడు. ఇలా మాయమాటలు చెప్పి బాధితుల వద్ద రూ.15 లక్షలు వసూలు చేశారు. ఈ పత్రాలు పట్టుకుని కోల్‌కతా వెళ్లిన బాధితులకు అసలు విషయం తెలిసింది. తాము మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు పశ్చిమ బంగాల్ వెళ్లారు. అక్కడే పది రోజులపాటు ఉండి కేసును ఛేదించారు. ముఠా సభ్యులైన ఓంకార్ కుమార్, రాకేశ్ కుమార్, రణధీర్ కుమార్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: