కృష్ణా జిల్లాలోని మొత్తం 49 మండలాలకు.. ఎనిమిది చోట్ల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడం లేదని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఉంగుటూరు, మండవల్లిల్లో జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీవమైందని చెప్పారు. మచిలీపట్నం, పెనమలూరు, జగ్గయ్యపేట మండలాల పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయని... జి.కొండూరు, విస్సన్నపేట, పెడన మండలాల్లో అభ్యర్ధులు మరణించిన కారణంగా ఎన్నిక వాయిదా వేశామని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే 41 మండలాల పరిధిలోని జడ్పీటీసీ ఎన్నికలకు 159 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.
89 చోట్ల ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు నిలిపివేత
812 ఎంపీటీసీ స్థానాలకు 89 చోట్ల ఎన్నికలు నిలిపివేశామని కలెక్టర్ వివరించారు. 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని... ఆరు స్థానాల్లో అభ్యర్ధుల మరణంతో అక్కడ ఎన్నికలు వాయిదా వేశామన్నారు. ప్రస్తుతం 648 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 1,631 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2,409 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
20,04,417 మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: