కృష్ణా జిల్లాలో మార్చి 10వ తేదీన విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థలు, నూజివీడు, నందిగామ, పెడన, తిరువూరు, ఉయ్యూరు మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మున్సిపల్ ఎన్నికలపై సోమవారం వీడియో కాన్ఫరెన్సు (వీసీ) నిర్వహించి, జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించగా, రికగ్నైజ్డు/రిజిస్టరు రాజకీయ పార్టీలకు చెందిన సదరు అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే.. ఆ వార్డుల్లో తిరిగి నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
జిల్లాలో నాలుగు వార్డుల్లో నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు మరణించారని, ఆ వార్డుల్లో ఈనెల 28వ తేదీన నామినేషన్లను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 29వ డివిజను (తెదేపా), 30వ డివిజను (వైకాపా), మచిలీపట్నంలో 23వ డివిజను (వైకాపా), తిరువూరులో 6వ వార్డు (వైకాపా) తరఫున నామినేషన్లు వేసిన వారు మరణించినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో సదరు నాలుగు వార్డులు/డివిజన్లలో నామినేషన్లను ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ఇక మిగతా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మార్చి 2 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తామన్నారు. మార్చి పదో తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ ఉంటుందన్నారు. రీ పోలింగ్ అవసరమైతే 13వ తేదీన నిర్వహిస్తారు. 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు.
పుర పోరుకు 1124 కేంద్రాలు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషనులో 64 డివిజన్లు, మచిలీపట్నంలో 50 డివిజన్లు, నూజివీడు మున్సిపాల్టీలో 32 వార్డులు, పెడనలో 23 వార్డులు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరుల్లో 20 వార్డుల చొప్పున ఉన్నట్టు వివరించారు. వీటిల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 1124 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2,466 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 237 సమస్యాత్మక, 119 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు తెలిపారు.
పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు
జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. జిల్లా మొత్తం 84.97 శాతం పోలయినట్టు పేర్కొన్నారు. పట్టణ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉంటారనే నానుడి ఉందని, దీన్ని విడనాడేలా ఓటింగు శాతం పెంచేందుకు చర్యలు చేపడతామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఇది చదవండీ.. ఓటు వేయలేదని దాడి చేయడం దారుణం: చంద్రబాబు