లాక్డౌన్ కారణంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ లేకపోవటంతో ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు లాక్ డౌన్ శరాఘాతంగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే అరటి పూర్తిగా పొలాలకే పరిమితమైంది. వీటిని అమ్మేందుకు ప్రయత్నిస్తే...రవాణాను సాకుగా చూపి వ్యాపారస్తులు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న భారతీయ కిసాన్ సంఘ్... రైతులను ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ముందుకు వచ్చింది.
రైతులు పండించే అరటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే 5 నుంచి 10 రూపాయలు ఎక్కువ చెల్లించి వారిని ప్రోత్సహిస్తోంది. ఇలా కొనుగోలు చేసిన అరటి పళ్లను పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఇలా అందించడం ద్వారా నిత్యం సమాజహితం కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు..రోగులకు పౌష్టికాహారం అందించినట్లవుతుందని సంస్థ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
రోజుకు 100 అరటిగెలల చొప్పున నగరంలో రేపటి నుంచి పంపిణీ చేసేందుకు ఇప్పటికే కిసాన్ సంఘ్ పలుప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అరటి గెలలను సేకరించింది. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు అరటి పళ్లు పంపిణీ కొనసాగుతుందని సంస్థ సభ్యులు చెబుతున్నారు.
కష్టకాలంలో తాము నష్టపోకుండా కిసాన్ సంఘ్... మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిసాన్ సంఘ్ చొరవతో మరికొంత మంది ఈ దిశగా ఆలోచించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అమరావతి ఆర్గానిక్స్ తరపున నగరంలో పలు ఔట్ లెట్ల ద్వారా సేంద్రీయ విధానంలో కూరగాయలను వినియోగదారులకు అందిస్తున్న కిసాన్ సంఘ్... తాజాగా ఉద్యానపంటలను సేకరించి పేదలు, చిన్న స్థాయి ఉద్యోగులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఇదీచదవండి