విజయవాడ నగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదాపడింది. ఈనెల 18 శుక్రవారంన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ, నిన్న నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలను రేపటి నుంచి అనుమతిస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తొలుత ఈ ఫ్లైఓవర్‌ను ఈనెల 4నే ప్రారంభించాలని భావించారు. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత నేపథ్యంలో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని సూచించింది. దీంతో ప్రారంభోత్సవం వాయిదా పడిన విషయం తెలిసిందే.
కాగా, ఇటీవల ఫ్లైఓవర్‌పై తీసిన డ్రోన్ వ్యూ ఆకట్టుకుంటోంది. ఇంద్రకీలాద్రిని ఆనుకుని, కృష్ణమ్మ ఒడిలో నిర్మించినట్లుగా కనిపిస్తున్న ఈ వంతెన ఔరా అనిపిస్తోంది. ఓ పక్క దుర్గమ్మ.. మరోపక్క కృష్ణమ్మ.. వీరిద్దరినీ కలిపినట్లుగా నిర్మించిన ఈ వారధి విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులు అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలే :హైకోర్టు