రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జులై నుంచి జమాబందీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు... ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాశ్చంద్రబోస్ తెలిపారు. 3 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈలోగా అన్ని రెవెన్యూ రికార్డుల్లో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారులతో... రికార్డుల నిర్వహణ, ఇళ్ల స్థలాలపై చేసిన సమీక్షలో ఉపముఖ్యమంత్రి సుభాశ్చంద్రబోస్, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పేర్ని నాని, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు రెవెన్యూ రికార్డుల నిర్వహణలో... ఇతర జిల్లాల కంటే కొంత మెరుగ్గా ఉన్నాయని అభినందించారు. అందుబాటులోని భూమి కంటే రికార్డుల్లో నమోదైన భూమి విస్తీర్ణం అధికంగా ఉంటోందని... న్యాయస్థానాల్లో అనేక కేసులు భూమికి సంబంధించినవే ఉండడానికి కారణం రికార్డుల్లో లోపాలేనని చెప్పారు. మునసబులు, కరణాల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత... రికార్డుల విషయంలో సరైన ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య కొనసాగుతోందని చెప్పారు.
ప్రస్తుతం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత... సంఖ్యాపరంగా సిబ్బంది పెరిగారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది సేవలను ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులు మే 31 నాటికి రికార్డులన్నింటినీ సరి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత నెలరోజులపాటు పరిశీలనకు సమయం ఇస్తామని చెప్పారు. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టరు కార్యాలయాల తనిఖీలు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి