గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించడం దుష్ట సంప్రదాయానికి దారి తీస్తుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలను వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాలు చేస్తూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి తమ వాదనలను వినిపించారు.
'ఈ తరహా సమీక్షలు గతంలో ఎన్నడూ జరగలేదు. సమీక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. శాసనసభ స్పీకర్ ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేయడం సరి కాదు. సభా వ్యవహారాలు చూసుకునే పరిమితమైన అధికారాలు మాత్రమే స్పీకర్‌కు ఉంటాయి' అని వారు పేర్కొన్నారు. దీనిపై అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ సిట్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 'గత ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించాకే సిట్ ఏర్పాటు చేశాం. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది...' అని చెప్పారు. అయితే.. ఆ దస్త్రం న్యాయమూర్తి వద్దకు చేరకపోవటంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తొలుత పిటిషనర్ తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తూ...'గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షిస్తూ ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు రాజ్యాంగ విరుద్ధం. మ్యానిఫెస్టో ప్రకారం రాజకీయపార్టీలు పలు నిర్ణయాలు తీసుకుంటాయి. వాటిని ఏ విధంగా పునఃసమీక్షిస్తారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. పాలించే రాజకీయపార్టీలే మారుతుంటాయి. గత ప్రభుత్వంలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టడానికి సిట్ ఏర్పాటు చేశారు. దీనికి ఠాణా హోదా కల్పించడం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. సహజంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక దర్యాప్తు చేస్తారు. ప్రస్తుత విషయంలో అందుకు భిన్నంగా సిట్ ఏర్పాటు.. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినడం కోసమే ఈ విధంగా చేశారు. సిట్ చర్యలను నిలువరించండి' అని కోరారు. ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 'అప్పటి ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. రాజధానిగా అమరావతి నిర్ణయించకముందే పలువురు చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారు. బినామీలు కొన్నారు. హెరిటేజ్, లింగమనేని రమేశ్ తదితరులకు అమరావతిలో భూములు కేటాయించారు...' అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి