Illegal Soil Mining: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ పరిధిలో అక్రమంగా జరిగిన మట్టి తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కొంతకాలంగా మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారంటూ ఫిర్యాదులు అందగా.. దీనిపై కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారులు నాలుగు రోజుల కిందట ఆకస్మికంగా తనిఖీకి వెళ్లారు. అక్కడ భారీగా మట్టి తవ్వకాలు జరుగుతుండటాన్ని గుర్తించిన గనుల శాఖ అధికారులు.. ఓ వ్యక్తికి చెందిన పట్టా భూమిలో చాలా కాలంగా మట్టి తవ్వి, విక్రయించుకున్నట్లు తేల్చారు.
ఆ వ్యక్తికి తాత్కాలిక పర్మిట్లు గానీ, లీజు గానీ తీసుకోలేదని గునుల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో అక్కడున్న పెద్ద గుంతల్లో కొలతలు వేశారు. సుమారు 25 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తరలించారని లెక్క తేల్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మట్టి అక్రమంగా తరలిపోయిందంటే.. ఒక్కో క్యూబిక్ మీటర్‌కు సీనరేజ్ ఫీజు, కన్సిడరేషన్ మొత్తం, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్), ఖనిజాన్వేషణ ట్రస్ట్ (మెరిట్), ఆదాయ పన్ను తదితరాలన్నీ లెక్కించి, దానికి పది రెట్లు జరిమానా విధించాలి.
ఈ లెక్కన 25 వేల క్యూబిక్ మీటర్లకు జరిమానాతో సహా 2 కోట్ల రూపాయల వరకూ అవుతుంది. కానీ గనుల శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతూ.. ఇప్పటి వరకూ ఈ చర్యలకు పాల్పడుతున్న అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గనుల శాఖ అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడానికి.. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లే కారణమని సమాచారం. జరిమానాలు, కేసు వంటివి ఏమీ లేకుండా వదిలేయాలంటూ ఆ ప్రజాప్రతినిధి.. అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గనుల శాఖలో మంత్రికి సంబంధించిన ఓ వ్యక్తి ఆ శాఖనే శాసిస్తుంటారు.
ఆయన కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని, అంతా కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకే దీని గురించి సమాచారాన్ని చెప్పేందుకు ఆ శాఖ అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారులను ‘ఈనాడు ఈటీవీ ప్రతినిధులు ’ ఫోనులో ఎన్నిసార్లు సంప్రదించినా.. సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు.
నేతల ఒత్తిళ్ల కారణంగా 2 కోట్ల రూపాయల జరిమానా లేకుండా వదిలేస్తారా? అనే అనుమానాలు వస్తున్నాయి. అక్రమ మట్టి తవ్వకాలపై దాడులు చేసినా.. చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దోపిడీ దాడులపై చర్యలకు అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే మట్టి మాఫియా అక్రమార్కులపై.. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: