స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం, జిల్లాల్ని యూనిట్‌గా చేసుకుని జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల కొన్నిజిల్లాలో ఊహించినదాని కంటే బీసీలకు తక్కువగా స్థానాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు పోగా మిగిలినవాటినే బీసీలకు కేటాయిస్తారు. 1995 నుంచి ఇప్పటివరకూ బీసీలకు 34 శాతం సీట్లు దక్కుతున్నాయి. ఈసారి రిజర్వేషన్లు 50 శాతానికే కుదించడం వల్ల బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేశారు. కానీ రిజర్వేషన్ల జాబితా అధికారికంగా విడుదలయ్యాక చూస్తే అంతకుమించి స్థానాలు బీసీలకు కోతపడ్డాయి.
నెల్లూరు... వారికి కన్నీరు
తెలుగుదేశం అంచనాల ప్రకారం 2014తో పోల్చితే నెల్లూరు జిల్లాలో బీసీలకు కేవలం 13.04 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. జిల్లాలోని 46 చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు ఆరేసి చొప్పున కేటాయిచారు. 562 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 59 మాత్రమే బీసీలకు దక్కాయి. మొత్తం 46 మండలాధ్యక్షులకుగాను 16 మండలాల్లో బీసీలకు ప్రాతినిథ్యమే లేదని ఆయా వర్గాలు ఆవేదనలో ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో బీసీలకు ఒక్క జడ్పీటీసీ కూడా కేటాయించలేదు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుంటే ఒక్కటీ బీసీలకు దక్కలేదు. ఐతే ఎంపీపీ మాత్రం బీసీలకు రిజర్వ్ చేశారు. తడ మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలుంటే ఒక్క జడ్పీటీసీ సీటు బీసీమహిళకు కేటాయించారు. ఎంపీపీ ఒక్కటీ ఇవ్వలేదు. గూడూరు నియోజకవర్గంలో ఒక్క 60 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ బీసీలకు ఇవ్వలేదు. బీసీలకు.. తూర్పుగోదావరి జిల్లాలో 20.96 శాతం, కృష్ణాలో 20.4 శాతం, ప్రకాశంలో 19.64 శాతం, విశాఖలో 20.51 శాతం సీట్లే దక్కినట్లు తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలపై కావాలనే వైకాపా కక్షగట్టిందని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.