కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెడసనగల్లులోని ఈ ఇంటిని... 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆరు తరాల అనుబంధానికి చిరునామాగా నిలుస్తున్న ఇంటిని... సూరపనేని సీతారాముడు, రంగమ్మ దంపతులు కట్టించారు. అప్పటి కాలానికి అనుగుణంగా, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా అణువణువూ తీర్చిదిద్దారు. ఇంటి లోపల ఉండే వస్తువులు, సామాన్లూ నాటి తరానికి దర్పణం పడుతున్నాయి.
వేసవిలో చల్లగా...శీతాకాలంలో వెచ్చగా
ఈ ఇంట్లో 90 ఏళ్ళనాటి అందమైన పందిరి మంచం ఉంది. అప్పటి ధాన్యం, మొక్కజొన్న తీసుకువచ్చే జనపనార సంచులు... నేటి రైతులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వడ్లు దంచుకునే కుంది, రోకళ్ళు, సుమారు 150 ఏళ్ల క్రితం లాకర్, చెక్క బీరువాలు... ఒకటా, రెండా... ఇలా ఎన్నో వస్తువులు అలనాటి జీవన శైలిని కళ్లకు కడుతున్నాయి. ఇంటిలోపలి దూలాల డిజైన్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా దృఢంగా ఉన్నాయి. ఎంత వర్షం పడినా పైకప్పునకు వేసిన పెంకుల్లో నుంచి చుక్కనీరు ఇంట్లోకి రాదు. ఇంటి గోడల్ని సున్నంతో 2 అడుగుల మేర మందంగా నిర్మించిన కారణంగా... వేసవికాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.
సూరపనేని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. వారిలో ఒకరైన లింగం శివకుమార్... ఈ ఇంటిని అపురూపంగా చూసుకుంటున్నారు. ఏడాదికోసారి ఇక్కడికి వచ్చి పండుగ జరుపుకొంటారని గ్రామస్థులు చెబుతున్నారు. తాళం కూడా తమ వద్దే ఉంటుందని... ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటామని అంటున్నారు. పూర్వీకుల వారసత్వానికి గుర్తుగా ఇంటిని కాపాడుకుంటున్న తీరు... గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ఊళ్లవారిని అబ్బురపరుస్తోంది.
ఇదీ చూడండి: