సంగం డెయిరీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 19 ను హైకోర్టు నిలుపుదల చేసింది . డైరెక్టర్లు డెయిరీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. సంగం డెయిరీ పై అధికారం పాలకవర్గానికే ఉందని హైకోర్టు తెలిపింది. డెయిరీ స్థిర, చర ఆస్తుల విక్రయాలు జరిపే ముందు హైకోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకువస్తూ ఏప్రిల్ 27న జారీ అయిన జీవో 19ను సవాలు చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
ప్రభుత్వం.. దురుద్దేశంతోనే సంగం డెయిరీ విషయంలో జోక్యం చేసుకుంటోందని పిటిషనర్ తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. డెయిరీని సహకార సంఘంగా మారుస్తూ కొన్నేళ్ల కిందట ఇచ్చిన జీవోను ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించిందన్నారు. గుంటూరు జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ను .. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ గా మార్చే క్రమంలో ప్రభుత్వానికి ఉన్న బకాయిలు, మూలధనం వాటాను తిరిగి చెల్లించారని చెప్పారు. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఏవీ లేవని స్పష్టం చేశారు. తర్వాత కంపెనీ చట్టం కింద ఎస్ఎంపీసీఎల్ గా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.
కంపెనీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకొని కార్పొరేట్ హోదా పొందాక జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీని స్వాధీనం చేసుకొని సబ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహణను చేపట్టిందని..., కంపెనీలో వాటాదారులు , డైరెక్టర్ల హక్కులను హరించేవిగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ప్రజాప్రయోజనం పేరుచెప్పి కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని.. ఒకవేళ ఉందనుకుంటే లిస్టెడ్ కంపెనీలు అయిన రిలయన్స్, అదానీ తదితర కంపెనీలలో షేర్స్ కొన్నవారి ప్రయోజనం కోసమనే పేరుతో ఆ కంపెనీలను స్వాధీనం చేసుకోవడం లాంటిదేనన్నారు. జీవో అమలును నిలుపుదల చేయాలని కోరారు.
షరతులకు కట్టుబడి ఉండకపోవడం వల్లనే 1978 లో జీవోను ఉపసంహరించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ వాదనలు వినిపించారు. తప్పుడు మార్గంలో ధ్రువీకరణ పత్రం పొంది కంపెనీ హోదా పొందారని.. సహకార సంఘం చట్ట ప్రకారం డెయిరీని స్వాధీనంలోకి తీసుకోకూడదనే నిషేధం ఏమి లేదని వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా పదెకరాల భూమిని ఆసుపత్రి ఏర్పాటు నిమిత్తం ట్రస్టుకు బదిలీ చేశారని.. పదెకరాల భూమి బదిలీకి జీడీఎంపీసీయూఎల్ గా ఉన్నప్పుడు 1994 లో తీర్మానం చేసి.. 1997లో జీడీఎంపీఎంఏసీయూఎల్ గా మార్చాక ప్రభుత్వ అనుమతి అవసరం లేదనే కారణం చూపుతున్నారన్నారు.
డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. షేర్ క్యాపిటల్ సొమ్ము మాత్రమే చెల్లించారన్నారు. డెయిరీ నిర్వహణ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదని..., మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపదల చేసింది.
ఇవీ చూడండి:
దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు: హైకోర్టు