జగయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై పది కేసుల ఉపసంహరణను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణను పది రోజుల తర్వాత పరిశీలన చేద్దామని హైకోర్టు పేర్కొంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను హైకోర్టుల అనుమతి లేకుండా ఉపసంహరించడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పది రోజుల తర్వాత పురోగతిని పరిశీలన చేద్దామని అభిప్రాయం వ్యక్తంచేసింది. విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వ విప్, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై 10 కేసుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు పిల్ దాఖలు చేశారు. విజయవాడలోని ఎంపీ,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులోని పది కేసుల ఉపసంహరణ కోసం మే 28న ఇచ్చిన జీవో 502ను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్దంగా జీవో ఇచ్చారన్నారు. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు అయ్యిందని.. అందులో నోటీసులు జారీచేశారని హోంశాఖ తరపున న్యాయవాది వాదించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పీపీకి తెలియజేస్తూ జీవో ఇచ్చారన్నారని తెలిపారు. అంతిమంగా ఉపసంహరణకు అనుమతించాల్సింది సంబంధిత కోర్టేనని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే ఓ వ్యాజ్యం దాఖలు అయి ఉండగా, పిల్ దాఖలు చేయడం ఎందుకని అభిప్రాయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మరో పది రోజులు వేచి చూద్దామంటూ వాయిదా వేసింది. పురోగతిని కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: