కృష్ణా జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడేది చేనేత పరిశ్రమే. వేలాదిమంది కార్మికులు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 సంఘాలు ఉండగా అందులో ఎక్కువ శాతం పెడన నియోజకవర్గంలో ఉన్నాయి. పెడన, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోలవరం, ఐదుగుళ్లపల్లి, మల్లవోలు, రాయవరం గ్రామాల్లో 20 సంఘాల వరకు ఉన్నాయి. మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి, ముదినేపల్లి, మొవ్వ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో చేనేత సంఘాలు ఉన్నాయి.
కొన్నేళ్లుగా సరైన విక్రయాలు లేక ఇవి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు కూడా నిలిపివేశాయి. సంఘాల నుంచి వస్త్రాలు కొనాల్సిన ఆప్కో ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు చేయడం లేదు. గతేడాది జిల్లావ్యాప్తంగా రూ.38 కోట్ల ఉత్పత్తులు వస్తే వాటిలో ఆప్కో కేవలం రూ. 1.50 కోట్ల వస్త్రాలు మాత్రమే కొనుగోలుచేసింది. ఆశించిన మేరకు ఆప్కో కొనుగోళ్లు చేయకపోయినా సంఘాల ప్రతినిధులు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ నడిపిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను బట్టి కొద్ది రోజుల్లోనే దాదాపు అన్ని సంఘాలు ఉత్పత్తులు నిలిపివేసే పరిస్థితి ఉందని నాయకులు చెబుతున్నారు.
చేనేత సహకార సంఘాలు : 36
మొత్తం మగ్గాలు : 4,270
కార్మికులు : 20 వేలు
నిండుకుంటున్న నూలు నిల్వలు
జిల్లావ్యాప్తంగా ఉన్న సంఘాల ద్వారా నెలకు దాదాపు రూ.3 కోట్ల ఉత్పత్తులు వస్తాయని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏడాదికి రూ.36 కోట్లకు పైగా ఉత్పత్తులు వస్తాయి. వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఇళ్లల్లో మగ్గాలు ఉన్నవారు అక్కడక్కడ కొందరు పనిచేసుకుంటున్నారు. వస్త్ర తయారీకి అవసరమైన నూలు సరఫరా నిలిచిపోయింది. పలు రకాల రంగులు, జరీ తదితర ముడి సరకులు లేవు. ఇప్పటివరకు ఉన్న నిల్వలతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ముడిసరకు వచ్చే మార్గం లేక, ఎగుమతులు వెళ్లే దారిలేక పనులు నిలిచిపోతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఉత్పత్తులతో పాటు ఇంతకు ముందు ఉన్న వాటితో కలిసి ప్రతి సంఘంలో రూ.కోటికి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. వస్త్రాల విక్రయాలు జరిగితే తప్ప పనులు వేగవంతం కావు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో పెట్టుబడి పెట్టలేక పోతున్నామని సహకార సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. కార్మికులు కూడా పని కోల్పోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర సరకులు మాదిరిగానే చేనేత పరిశ్రమకు కూడా కొద్దిపాటి మినహాయింపు లేకపోతే కార్మికులంతా పనులు కోల్పోక తప్పదని, ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఇప్పటికే చాలామంది కార్మికులు చేనేత పరిశ్రమను వదిలి ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా నేతకు అవసరమైన ముడిసరకు లభించక.. వస్త్రాల విక్రయాలు లేక పలు సంఘాలు కార్మికులకు పని కల్పించలేమంటున్నాయి. మున్ముందు మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పని లేకపోతే ఎలా బతుకుకామని.. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: