State Governor Abdul Nazir : భారతదేశం 2030 నాటికి ప్రపంచానికి డ్రోన్ హబ్‌గా మారనుందని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తెలిపారు. 2024 నాటికి టర్నోవర్ 900 కోట్ల రూపాయల వరకు చేరబోతోందని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులోని దనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన డ్రోన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్స్ టెక్నాలజీ గురించి ఇజ్రాయిల్‌కు చెందిన డ్రోనిక్స్ ఇంజినీరింగ్ ప్రతినిధులు వివరించారు. డ్రోన్లలోని భాగాలైన ఫ్లైట్ కంట్రోల్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, సెన్సార్లు, కెమెరాలు, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ, బ్యాటరీ, ప్రొపల్షన్ సిస్టం, పేలోడ్ డెలివరీ సిస్టం పనితనం గురించి తెలిపారు. ప్రస్తుతం ఏరోస్పేస్ ఇంజినీరింగ్, రోబోటిక్స్, రిమోట్ సెన్సింగ్, రెగ్యులేటరీ కంప్లయన్స్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లలో విరివిగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం.. డ్రోన్లను పరిశీలించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మన దేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. కొన్ని సాంకేతిక రంగాల్లో డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని తెలిపారు. ఏరోనాటికల్ టెక్నాలజీలో నిపుణులు, నిష్ణాతులైన దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వివిధ ఇంజినీరింగ్ బ్రాంచిలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు గవర్నర్ బంగారు, వెండి పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, కాకినాడ జేఎన్‌టీయూ ఉపకులపతి జీవీకే ప్రసాద రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో ఇండియా అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. అదే విధంగా పలు రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచుతోంది. డ్రోన్ల వాడకం ప్రస్తుతం ఫొటో, వీడియోగ్రఫీ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నా.. వాటి సేవలను ఆహార సరఫరా, జియోగ్రాఫికల్ మ్యాపింగ్, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, శత్రు నిఘాతో పాటు, అగ్నిమాపక సేవల్లో వినియోగిస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీలో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి. డ్రోన్ల తయారీ, డిజైన్, ఇంటిగ్రేషన్, ట్రబుల్ షూటింగ్ తదిత అంశాల్లో రాణించాలి. డ్రోన్ టెక్నాలజీ పై రీసెర్చ్, ఫ్యూచర్ రీసెర్చ్, డిజైన్ టెస్టింగ్‌పై పలు సంస్థలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయి. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అంటే ఆయనకు ఇష్టం. ఆ ఆసక్తి ఆయన్ను రాకెట్ సైన్స్ దిశగా నడిపించింది. అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలి. - ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్
ఇవీ చదవండి :