EX CM KIRAN KUMAR REDDY SPEECH: రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా ఇరు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని, అందువలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయాలన్నారు. సంక్రాంతి సందర్భంగా విజయవాడలో సమతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీక కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
'ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు మనల్ని పాలించింది' - జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ రాజశేఖర రెడ్డి విమానంలో నేనూ వెళ్లాల్సింది: రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాత నేను రాజీనామా చేస్తానని అధిష్టానానికి చెప్పానని మాజీ సీఎం తెలిపారు. విభజన చేస్తే తెలంగాణ, ఏపీకి నష్టం వస్తుందని వివరించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని 155 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అఫిడవిట్లు దాఖలు చేశారని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్లే విమానంలో తాను కూడా వెళ్లాల్సిందని, కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూర్పు కోసం ఆగడం జరిగిందన్నారు.
పార్టీ మారాను కానీ నా సిద్ధాంతాలు మార్చుకోలేదు: తనకు ముఖ్యమంత్రి సీటు కావాలని ఎవరినీ అడగలేదన్నారు. రాత్రి 11 గంటల సమయంలో సోనియా గాంధీ ఫోన్ చేసి ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. నేడు అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఎన్నికలంటే భయం వేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేమని వివరించారు. అవినీతి లేని వ్యవస్థను తయారు చేయాలన్నారు. తాను ప్రాంతీయ పార్టీల్లో ఉండలేనన్నారు. వామపక్ష పార్టీల్లో జాయిన్ కాలేనని, ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. అందుకే బీజేపీలో జాయిన్ అయ్యానని చెప్పారు. పార్టీ మారాను తప్ప తన సిద్ధాంతాలు మార్చుకోలేదన్నారు.
''రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అవుతున్నా ఇరు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలు ఉన్నాయి.అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్నికలంటేనే భయం వేస్తుంది.డబ్బులను లూటీ చేసే వారే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అలాంటి వారికే మీరు ఓటు వేస్తున్నారు. పార్టీ వేరైనా నా సిద్ధాంతాలు మారవు'' -నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు