AP govt guidelines on public meetings: రహదారులపై రోడ్ షోలు, సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులు, మార్జిన్లపై రోడ్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. రోడ్ షోలు, సభలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచనలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల సాకుగా చూపుతూ.. రహదారులతో పాటు వాటి పక్కన, మార్జిన్లలో రోడ్ షోలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిర్వహించుకునేలా చూడాలని పోలీసులకు హోంశాఖ సూచించింది. పోలీసు యాక్టు 1861లోని సెక్షన్ 30 ప్రకారం వివిధ సందర్భాల్లో నిబంధనలు నిర్దేశించిన ప్రకారమే పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని .. అవసరమైతే రోడ్ షోల అనుమతి నిలిపివేయాలని జిల్లా ఎస్పీలు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సందర్భానుసారంగా అనుమతి ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర , మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లు, మార్జిన్ల వద్ద రోడ్ షోల నిర్వహణకు నిబంధనలు వర్తింప చేస్తూ ఆదేశాలిచ్చారు. సభలు, దరఖాస్తు చేసుకున్న రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను సూచించటంతో పాటు ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రదేశాల ఎంపిక ఉండాలన్నారు. ఇక నుంచి పోలీసులు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే రాజకీయ పార్టీలు సభలు , ర్యాలీలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకే రహదారులు, వీధుల్లో సమావేశాలు, ర్యాలీలు నియంత్రించాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇరుకు సందులు, రహదారుల్లో రోడ్ షోల వల్ల వక్త ప్రసంగించే చోటుకు చేరుకునేందుకు కొందరు ప్రయత్నించటం వల్లే ….తొక్కిసలాట ఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని....వాటిని నిరోధించేందుకు రహదారులకు దూరంగా వీటిని నిర్వహించాల్సి ఉందని హోంశాఖ పేర్కొంది. వెంటనే బాధితుల్ని ఆస్పత్రులకు తరలించటమూ ఇబ్బందిగా మారినట్లు తెలిపింది. శాంతియుతంగా నిర్వహించే ప్రదర్శనలు రాజకీయ పార్టీల హక్కే అయినా.. ప్రజా ప్రయోజనం రీత్యా రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించే హక్కు కూడా నియంత్రణకు లోబడే ఉంటుందని స్పష్టం చేసింది. పండుగలు, కార్యక్రమాల వేళ వాయిద్యాలు, సౌండ్ బాక్సులతో రోడ్లపై నిర్వహించే ర్యాలీలను నియంత్రించాలని హోంశాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి