Gold Goalmaal at Abhayanjaneya Swamy Temple : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో బంగారు నగల గోల్మాల్ జరిగింది. స్వామి వారి ఆభరణాలు పూజారి తాకట్టు పెట్టి.. వచ్చిన డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దేవాదాయశాఖ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. దేవాదాయశాఖ విచారణలో 45 గ్రాముల బంగారం మాయమైనట్లు సమాచారం. అర్చకుడు సీతారామానుజాచార్యులు వద్ద ఆ బంగారం ఉందని.. రెండ్రోజుల్లో అప్పగిస్తానని వాంగూల్మం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక గొలుసు, రెండు నామాలు కన్పించలేదని గుర్తించారు. మాయమైన బంగారం ఇంకా ఎక్కువేనని.. అధికారుల విచారణ నేపథ్యంలో హడావుడిగా తెచ్చి సర్దుబాటు చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి.
అధికారుల దర్యాప్తులో 45 గ్రాముల స్వామి వారి నగలు అర్చకుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించామని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ సురేష్ బాబు తెలిపారు. రికార్డులు ప్రకారం స్వామి అభరణాలు 915 గ్రాములు ఉండగా ప్రస్తుతం 869.70 గ్రాములు బంగారం ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 45 గ్రాముల బంగారం.. అర్చకుల అధీనంలో ఉన్నట్లు తెలిపారు. రేపు అధికారులు సమక్షంలో మిగిలిన బంగారాన్ని సమర్పించాలని సురేష్ బాబు ఆదేశించారు. అనంతరం మొత్తం బంగారాన్ని బ్యాంకు లాకర్లో భద్రపరుచనున్నట్లు జాయింట్ కమిషనర్ సురేష్ బాబు వెల్లడించారు.
ఇదీ చదవండి