Ganta fire on CM Jagan: నాలుగేళ్లుగా ప్రజలకు జగనే పెద్ద సమస్య: గంటా శ్రీనివాసరావు - Jaganannaku Chebudam
Ganta fire on CM Jagan : ముఖ్యమంత్రి ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా అని అడిగిన ఆయన.. గడిచిన నాలుగు సంవత్సరాలుగా స్పందనకు కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం ఏమైనా వుందా? అని ప్రశ్నించారు.
Ganta fire on cm jagan : ముఖ్యమంత్రి ప్రారంభించిన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని వ్యాఖ్యానించారు. రాజధాని కోసం తమ పొలాలు అప్పగించి దగా పడ్డ అమరావతి రైతుల సమస్యలు పరిష్కరిస్తారా..? లేక.. జీతం ఎప్పుడు వస్తుందో అని ప్రతి నెలా ఎదురు చూసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు. కరవుతో అల్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద రైతుల సమస్యలు పరిష్కరించగలరా..? పెన్షన్ కోసం ఎదురు చూసే రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు తీరుస్తారా..? అని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులకు అండగా ఉంటారా..? లేక.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తారని నమ్మి మోసపోయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా జీతాలు సరిగ్గా పడక, జీతాలు పెరగక అవస్థలు పడుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తారా..? అని ప్రశ్నలను సంధించారు.
మద్య నిషేధం అమలేదీ.. అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఆపై దానినే ఆదాయ వనరుగా మార్చి.. కొత్త నాసిరకం బ్రాండ్లు తాగి ప్రాణాలు కోల్పోయి బజారున పడ్డ వారి కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని శ్రీనివాసరావు దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పోగొట్టుకున్న అవ్వ, తాతల సమస్యలు పరిష్కరిస్తారా..? లేక.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కానీ.. ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లేక ఎదురు చూస్తున్న నిరుద్యోగుల సమస్యలు తీరుస్తారా..? అని నిలదీశారు. ఉచితంగా అందించే ఇసుకను వ్యాపార మయం చేసి... సరైన ఉపాధి దొరక్క సుమారుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు తీరుస్తారా..? అని అన్నారు.
ఎమ్మెల్యేల సమస్యలు తీరుస్తారా..? దుర్భర జీవితాలు గడుపుతున్న చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారా? కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా..? అని దుయ్యబట్టారు. మీరు ఇస్తుంది గోరంత.. మా నుంచి దండుకుంటున్నది కొండంత... అని వాపోతున్న ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారా..? సమాధానం చెప్పాలన్నారు. రక్తమోడ్చి మీ పార్టీని గెలిపించినా మీ ఎమ్మెల్యేల పైన అనుమానపు, అవమానపు చూపులే అని కళ్ల నీళ్లు పెట్టిన కొందరు ఎమ్మెల్యే లు, తమకు జరిగిన అన్యాయం గురించి బాధని పంటి కింద బిగపట్టిన మరికొందరి మీ ఎమ్మెల్యే ల సమస్యలు పరిష్కరిస్తారా..? 20 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి... స్పెషల్ స్టేటస్ సాధిస్తాం అని చెప్పిన మీరు, ఇప్పుడు మీరు ఢిల్లీలో చేస్తున్నదేంటి అని అడిగితే ఏమి సమాధానం చెబుతారు...? గెలిచిన తొలి సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేస్తామని.. సంవత్సరాలు గడుస్తున్నా.. మీ మంత్రులు మారుతున్నా.. పోలవరం నిర్మాణం లో ఎలాంటి పురోగతి లేదంటే ఏమి సమాధానం చెబుతారు...? వైజాగ్ రైల్వే జోన్ కోసం పోరాడతాం.. పార్లమెంట్ లో కొట్లాడి రైల్వే జోన్ సాధిస్తామని నమ్మబలికిన మీరు.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు..? ఏం సమాధానం చెబుతారు..? అని మండిపడ్డారు.
అరాచక పాలన ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ అరెస్టులు, ఆస్తులు ధ్వంసం ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా..? అని నిలదీశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగానే మారిందని గంటా పేర్కొన్నారు. ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు వందల కొద్ది పెట్టినా... ప్రజా సమస్యల ఫోన్ కాల్స్‌తో మీ టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కావు అనే సత్యాన్ని గ్రహించండి జగన్ గారూ! అంటూ గంటా ట్విటర్ ద్వారా సూచించారు.
ఇవీ చదవండి :