ప్రకాశం బ్యారేజీ వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక - ప్రకాశం బ్యారేజీ వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక న్యూస్
కృష్ణా నదికి వరద నీరు పోటెత్తటంతో.. ప్రకాశం బ్యారేజీ వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత మండలాలు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదిలోకి వరద నీరు భారీగా చేరుతుండటంతో... ప్రకాశం బ్యారేజీ వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 4 లక్షల 16 వేల 709 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 4 లక్షల 11 వేల 880 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నదిలో నాటు పడవలు, మర పడవలు, స్టీమర్లతో ప్రయాణాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వరద నీటిలో ఈతకు, స్నానాలకు దిగవద్దని కోరారు.
కృష్ణా జిల్లాలో కృష్ణా తూర్పు, పశ్చిమ బ్రాంచి కాల్వలతోపాటు , ఏలూరు కాల్వ, బందరు కాల్వ, రైవస్ కాల్వ, కేఈ మెయిన్ కాల్వలకు నీరు విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఘాట్ల పైనుంచి కృష్ణానది ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో మూడున్నర లక్షల క్యూసెక్కులకు చేరటంతో అధికారులు ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం అంతకుమించే నీరు వస్తున్నందున... నదీ పరివాహక ప్రదేశంలోని కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నదికి ఆనుకుని ఉన్న కృష్ణలంక ప్రాంతంలో నివాసాల వద్దకు నీరు చేరింది. భూపేష్‌గుప్తానగర్, తారకరామనగర్ తదితర లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ముంపు ప్రభావ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. అధికారులకు సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సబ్ కలెక్టరు, ఇతర అధికారులు కోరారు.