Farmers protest in Mallivalli Industrial Area: విజయవాడకు సమీపంలోని మల్లవల్లిలో పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అర్జీలు ఇవ్వడం.. ఆ వెంటనే అధికారుల ఆఘమేఘాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం అనేక సంవత్సరాలుగా ఇదే వ్యవహరం నడుస్తోంది. కడుపు మండిన రైతులు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు మల్లవల్లి పారిశ్రామికవాడ వద్దే రైతులు ఆందోళన చేస్తున్నారు.పేద రైతులు.. పైగా భూమిని పోగొట్టుకుని ఉన్నారు.. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా మీనమేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటే అన్నదాతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికవాడ అభివృద్దికి శ్రీకారం చుట్టింది. అందుకోసం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం 611 మంది రైతుల నుంచి 1467 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది.
త్రిసభ్య కమిటీని నియమించి.. రైతుల వద్ద నుంచి భూములు సేకరించే సమయంలో ప్రభుత్వం ఎకరాకు 7 లక్షల 50 వేలు నష్టపరిహరం చెల్లిస్తామని హమీ ఇచ్చింది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో మెగా మెదటి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసే ఉద్దేశంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జియోకాన్ సర్వే నిర్వహించి 611 మంది రైతులను గుర్తించారు. ఈ 611 మంది రైతుల్లో దాదాపు 450 మంది రైతులకు ఎకరాకు 7.50 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించారు. అప్పటి సర్వే కొంత సాంకేతిక కారణాలు, భూమికి సంబంధించి పత్రాల ఇబ్బందులు వంటి కారణాలతో సుమారు 128 మంది రైతులకు అధికారులు నష్టపరిహారం నిలిపివేశారు. రైతుల ఆందోళనతో వారికి నష్టపరిహారం అందేలా చూసేందుకు ఉన్నతాధికారులు ముందుకు వచ్చి త్రిసభ్య కమిటీని నియమించి 15 రోజుల్లో రైతులు ఆ కమిటీకి అర్జీలను అందజేయాలని గత సంవత్సరం డిసెంబరు 30వ తేదీన ప్రకటన చేశారు. అధికారులు ముందుకు వచ్చి కమిటీని ఏర్పాటు చేసి అర్జీలకు తీసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమను తప్పుదారి పట్టిస్తున్నారని రైతులు భావించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని భావించి మల్లవల్లి పారిశ్రామికవాడ వద్దే ప్రత్యక్ష ఆందోళనకు తెర తీశారు.
టీడీపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే.. పిల్లలు చనిపోవడంతో అన్నం పెట్టేవారు కూడా లేరని.. ప్రభుత్వం తమ భూమికి సంబంధించి నష్టపరిహరం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 2016లో భూములు తీసుకుని ఇప్పటి వరకు నష్టపరిహరం చెల్లించకపోవడం దారుణమని వాపోతున్నారు. తమ భూములు తీసుకునే సమయంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేనే అప్పుడు ఉన్నారని, తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లితే ఆయన 15 రోజుల్లో చేయిస్తాను.. మీరు ఆందోళన చెందవద్దని చెప్పారని, తర్వాత ఆయన పట్టించుకోవడం లేదని చెప్పారు. నష్టపరిహారం ఇచ్చిన 458 రైతుల వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో తమ వద్ద కూడా ఆవే ఆధారాలు ఉన్నాయని.. మరి ఎందుకు తమకు నష్టపరిహారం ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ భూమిలో నిర్మించిన పరిశ్రమ వద్దకు వెళ్లి అడిగితే వారు పోలీసులకు సమాచారం ఇచ్చి తమపై కేసులు పెట్టేలా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము సంఘవిద్రోహ శక్తులం కాదని, పదిమందికి ఆన్నం పెట్టే రైతులమని అంటున్నారు. గత ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చే వరకు ఇదే పారిశ్రామికవాడలో ఉంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి: