కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం నేతలు కొల్లి నాగేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, కాపా శ్రీనివాసరావు అన్నారు. దిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రైతులు చేపట్టిన సంఘీభావ దీక్షల సభలో పలువురు రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని పురుగుమందులు, ఎరువులు ప్రభుత్వాలు సరఫరా చేయాలన్నారు.
మోటర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. రైతన్నలకు ఉచితంగా నిరంతరాయ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వమే అందించాలని.. లేనిపక్షంలో ప్రభుత్వాలే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని పూర్తిగా నష్టపరిచే విధంగా ఉన్న వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం నేతలు అన్నారు. రైతుల పోరుబాటకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వ్యవసాయాన్ని నష్టపరిచే చట్టాలు.. ఉపసంహరించే వరకూ రైతు దీక్షలు విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రామతీర్థం ఘటనపై వారికి నార్కో పరీక్షలు చేయాలి: మంత్రి కొడాలి నాని