Etela Rajender Respond to KCR Comments: అసెంబ్లీలో తన ముఖం చూసేందుకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టపడటం లేదని గతంలో పలుమార్లు ఈటల రాజేందర్ అన్నారు. కానీ, ఇవాళ శాసన సభలో అందుకు విరుద్ధంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఒక్కసారి కాదు.. పలుమార్లు మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీల పెంపు విషయంలో ఈటల రాజేందర్ సలహా తీసుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెట్టామని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ సభలో అనేక విషయాలను ప్రస్తావించారని చెప్పారు. వాటిని స్వాగతిస్తాం.. వాటిపై చర్చిస్తాం.. అంటూ ఇలా పలు మార్లు ఈటల పేరును కేసీఆర్ ప్రస్తావించారు.
తనను డ్యామేజ్ చేయాలని చూశారు: సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తన పేరును పలుమార్లు ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తనను డ్యామేజ్ చేయాలని చూశారని వివరించారు. తనను డ్యామేజ్ చేసే వ్యూహంతోనే అలా మాట్లాడారని చెప్పారు. ఒక అబద్ధాన్ని ఇటు చెప్పగలరు.. అటూ చెప్పగల నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ఆయన చేసిన డ్యామేజ్ కడుక్కోవాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియదని వివరించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడున్నా ఆ పార్టీకి విధేయుడిగా ఉంటా: తనను అసెంబ్లీకి రాకూడదని చేశారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. తన మీద చేసిన దాడి.. అవన్నీ మరిచిపోలేదని అన్నారు. తన సూచనలకు స్పందించినంత మాత్రాన.. తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. ఎక్కడున్నా ఆ పార్టీకి విధేయుడిగా ఉంటానని వివరించారు. బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ప్రతిపక్షాలను అవమానపరిచేట్లు అధికార పార్టీ వ్యవహరించిందని మండిపడ్డారు.
మందబలం ఉందని మమ్మల్ని తిట్టే పని పెట్టుకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అందరిని సమానంగా చూసుకోవాల్సి ఉన్నా.. అది జరగడం లేదని విమర్శించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో చోటు చేసుకున్న లోపాలను సవరించాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులెవరూ మానసికంగా సంతోషంగా లేరని వివరించారు. ఇవాళ 12వ తేదీ అయినా.. జీతాలు రాలేదని చెప్పారు.
ఒక స్టేటస్ ఉంది: తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. తనకంటూ ఒక స్టేటస్ ఉంది.. అందువల్లనే హుజూరాబాద్ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారని గుర్తు చేశారు. తనకు సొంత అజెండా ఉండదని.. ప్రజా సమస్యలు చర్చించేందుకే అసెంబ్లీకి వచ్చానని అన్నారు. ప్రజా సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం పిలిస్తే వెళ్తానని వ్యాఖ్యానించారు. డైట్ ఛార్జీల విషయంలో పిలిస్తే వెలుతానని ఈటల తెలిపారు.
"అసెంబ్లీకి రాకూడదని చేశారు. నామీద చేసిన దాడి.. అవన్నీ మరిచిపోలేదు. నా సూచనలకు స్పందించినంత మాత్రాన నేను పార్టీ మారను. ఎక్కడున్నా ఆ పార్టీకి విధేయుడిగా ఉంటా. బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ రోజులు ఎప్పుడూ జరగలేదు. ప్రతిపక్షాలను అవమానపరిచేట్లు అధికార పార్టీ వ్యవహరించింది. మందబలం ఉందని మమ్మల్ని తిట్టే పని పెట్టుకున్నారు. అందరిని సమానంగా చూసుకోవాల్సి ఉన్నా.. అది జరగడం లేదు." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి :