Eight Years of Amaravati Foundation Stone : ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు పూర్తయింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఏర్పాటు కోసం జరిగిన భూసమీకరణ కసరత్తు ఒకెత్తు కాగా.. ఆపై 2019 సార్వత్రిక ఎన్నికల (General Elections) తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో... కోర్టుల్లో విచారణ, రైతుల ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎనిమిది విజయదశమిలు వచ్చినా... సాకారం కాని అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక కథనం.
ప్రధాని శంకుస్థాపన.. ఎనిమిదేళ్ల కిందట అక్టోబరు 22వ తేదీ విజయదశమి రోజున.. ఉద్దండరాయునిపాలెం (Uddandarayunipalem) వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రజా రాజధానిగా అమరావతి కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగు జాతి గుండెచప్పుడుగా నిలుస్తుందని.. అంతా ఆకాంక్షించారు. కానీ, ప్రస్తుతం అక్కడ శిలాఫలకాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. దీంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా 33 వేల ఎకరాల భూములను సమీకరణ విధానంలో అందించిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తోందంటూ మండిపడుతున్నారు.
అసెంబ్లీ తీర్మానం... 2014లో అప్పటి సీఎం చంద్రబాబు (CM Chandrababu) అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అనంతరం రైతుల నుంచి భూమి సేకరించి.. రోడ్లతో పాటు పలు కీలక నిర్మాణాలు చేపట్టారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత.. అమరావతి అభివృద్ధిని పూర్తిగా ఆపేశారు. అమరావతికి బదులుగా మూడు రాజధానుల అంశానికి సంబంధించిన ప్రతిపాదనను జగన్ అసెంబ్లీలో చేశారు. దీంతో 2019 డిసెంబరు 17వ తేదీన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఉద్యమ జెండా ఎత్తారు. నాటి నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. పోలీసులు దమనకాండకు పాల్పడినా, మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసినా.. వేర్వేరు రూపాల్లో ప్రభుత్వం ఒత్తిళ్లు తెచ్చినా.. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా నిరసనలు తెలుపుతున్నారు. పాదయాత్రలు, ఆందోళనలతో దేశమంతా తమ వైపు తిరిగి చూసేలా చేశారు. రాజధాని మార్చే అధికారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు ఆదేశించడంతో ఊపిరి పీల్చుకుందామనుకున్నారు. కానీ, జగన్ (Jagan) సర్కార్ హైకోర్టు నిర్ణయాన్ని పట్టించుకోలేదు. దీంతో రైతులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఇప్పుడు అమరావతి అంశం సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది.
ఏకగ్రీవ తీర్మానాలు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలోని నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆపేయడంతో.. అక్కడ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కోట్లు ఖర్చు చేసి.. నిర్మించిన భవనాలు వృథాగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలం కేటాయించినా.. అక్కడ మౌలిక వసతులు లేక వారు నిర్మాణాలు ప్రారంభించలేదు. నిర్మాణాలు ప్రారంభించిన సంస్థలూ మధ్యలోనే ఆపేశాయి. అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. 19 గ్రామాలతోనే అమరావతి నగరపాలక సంస్థ (Amaravati Municipal Corporation) అన్నారు. ఆ తర్వాత అమరావతి మున్సిపాలిటీ అన్నారు. వాటి కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. రైతులంతా ఐకమత్యంతో వీటిని ఎదుర్కొన్నారు. 29గ్రామాలతో కూడిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. ఎలాంటి మార్పులకు అంగీకరించేది లేదని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.
కోర్టు కేసుల్లో రాజధాని... అమరావతి ప్లాన్‌ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం R-5 జోన్‌లో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి.. కొత్త ఎత్తుగడ వేసింది. 50వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చేందుకు 1140ఎకరాలు కేటాయించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కి అనుమతించిన సుప్రీంకోర్టు.. తుది తీర్పునకు లోబడే వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించింది. దాన్ని ఖాతరు చేయని జగన్ సర్కార్.. ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. దీనిపై రైతులు హైకోర్టు (High Court)ను ఆశ్రయించడంతో.. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సీఎం జగన్ కుట్రలకు తాత్కాలిక అడ్డుకట్ట పడి.. రైతులకు ఊరట లభించింది.
వైసీపీ ప్రభుత్వ చర్యలు రాజధాని ప్రజల్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు కూడా సకాలంలో చెల్లించటం లేదు. మే నెలలో చెల్లించాల్సిన కౌలు ఇప్పటికీ ఇవ్వలేదు. కౌలు సొమ్ముల కోసం రైతులు ప్రతిసారీ హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది. ఉన్న భూములు సీఆర్డీఏ (CRDA)కు ఇచ్చిన రైతులు వేరే ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు సీఎం ఇటీవల విశాఖ రాజధానిగా ఉండబోతుందని ప్రకటించడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వచ్చే విజయదశమి నాటికైనా 5 కోట్ల ఆంధ్రులతో పాటు తమ జీవితాల్లోనూ వెలుగులు రావాలని రాజధాని రైతులంతా కోరుకుంటున్నారు.