drdo chairman satish reddy: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని విద్యార్ధులు, యువతకు డీఆర్డీవో ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నిర్వహిస్తోన్న 'రక్షణ పరిశోధన - అభివృద్ధి సంస్థ, విజ్ఞాన్ ప్రసార్' సంయుక్త వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన తిలకించారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్‌డీవో, ఎన్‌ఐటీలు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొని.. శాటిలైట్లు, ఇతర నమూనాలను పరిశీలించారు.విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధి విద్యార్థులకు వివరించారు.భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందని అన్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లోనూ ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలపాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని చెప్పారు.
దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధిక శాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నారని సతీష్ రెడ్డి అన్నారు. ఇటీవల 60 వేల స్టార్టప్‌లు ప్రారంభం కావడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో అంకుర సంస్థగా రాణిస్తామని ముందుకు వస్తే వారికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువత మేథోసంపత్తే దేశానికి దన్ను అని.. ఇందుకు విశ్వవిద్యాలయాలే గొప్ప వేదికలు అని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్‌ను తయారుచేశామని అన్నారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్‌లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను డీఆర్‌డీవో రూపొందించిందని గుర్తు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్‌లను విరివిగా తయారు చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి
మారుతున్న యుద్ధరీతి- పట్టణాల్లో పౌరుల గెరిల్లా పోరు!