కరోనా నియంత్రించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. మూడో దశలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు.. ఆపైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అందరికీ త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా పంపిణీని ప్రారంభించింది. వృద్ధులు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది భయంతో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి భయం అవసరంలేదని.. ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు.
మూడో దశలో లక్షా 24 వేల 474 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అందులో 89 వేల 896 మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2,144 కేంద్రాల్లో కొవిడ్ టీకా ప్రక్రియను ప్రారంభించింది. వీటికి అదనంగా ఉన్న 645 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం వ్యాక్సినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. త్వరగా టీకాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సంఘం కోరుతుంది. తమ వెల్ఫేర్ సంఘం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. దీంట్లో భాగంగానే తాము కొవిడ్ టీకాను తీసుకున్నామని పేర్కొన్నారు. వృద్ధాశ్రమం నిర్వాహకులు తమ ఆశ్రమంలోని వారికి సొంత ఖర్చులతో టీకాలు వేయిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌కు ధైర్యంగా ముందుకు రావాలని వృద్ధుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...: అదుపు తప్పి లారీ బోల్తా.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు