కృష్ణా జిల్లా దివిసీమ వాసులను పాముకాట్లు కలవరపరుస్తున్నాయి. పొలాలకు వెళ్లిన రైతులు... ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అరచేత పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన సమయంలో వైద్యం అందక కొంతమంది మృత్యువాత పడుతున్నారు.
జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 70 వేల ఎకరాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలం కావటంతో పుట్టల్లో నుంచి బయటకు వస్తున్న పాములు... రైతులను, కూలీలను కాటేస్తున్నాయి. ఈ ఏడాది అవనిగడ్డ ప్రాంతంలో 380 మంది పాముకాటుకు గురయ్యారు. ముగ్గురు మృతి చెందారు. నారుమడుల్లో పాములు రాకుండా విషపు వాసన గుళికలు చల్లినా... ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. పాము కరిచిన వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోతున్నాయని వాపోతున్నారు.
నాగుపాము, రక్త పింజరి, కట్ల పాము, గుమ్మడిత్తుల పాములు రైతులను ఎక్కువగా కరుస్తున్నాయి. నీటి అడుగున ఉంటున్న చిన్న పాములు... నాట్లు వేస్తున్న కూలీలను కాటేస్తున్నాయి. అయితే పాము కాటుకు గురైనవారు వెంటనే తగిన జాగ్రత్తలతో దగ్గరలోని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. పాము కాట్ల నుంచి రక్షణకు హోమియో మాత్రలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి