తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నుంచి మినీ వ్యాన్‌లో నీళ్ల డ్రమ్ములలో రవాణా చేస్తున్న 2500 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం నుంచి విజయవాడకు మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ముకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు.
కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా జరుగుతున్న మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గడిచిన నెల రోజుల్లో జిల్లాలో 1800 కేసులు నమోదు చేసి... 2,700 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి 57 వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 1.8 కోట్లు ఉంటుందని చెప్పారు. మద్యం రవాణాతో పాటు నాటుసారాపై దృష్టి పెట్టామన్నారు. నాటుసారా కేంద్రాలపై ఆధారపడి ఉన్న 280 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు. నందిగామ సబ్ డివిజన్లో మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చొరవ చూపిస్తున్న డీఎస్పీ రమణమూర్తినీ ఏఎస్పీ అభినందించారు. 2500 మద్యం సీసాలను పట్టుకున్న సిబ్బందికి రివార్డులను అందజేసి వారిని అభినందించారు.