కృష్ణా జిల్లా నూజివీడులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలగో రోజైన ఆదివారం శ్రీ లలితాత్రిపుర సుందరి దేవిగా జగన్మాత భక్తులకు దర్శనం ఇచ్చారు. నూజివీడు పట్టణంలో కుందనపు వారి వీధిలోని శ్రీ మత్ కామాక్షి అమ్మవారి ఆలయం, శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మ వారి ఆలయం, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో ఉదయం నుంచి అమ్మవారికి కుంకుమార్చన, సహస్ర శతనామావళి, విశేషమైన పూజలు నిర్వహించారు. మాస్కులు ధరించిన భక్తులకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పించారు. వందలాది మహిళలు బోనాలు ఎత్తుకుని..అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నృత్యాలు చేస్తూ, అమ్మ వారిని స్మరిస్తూ... ఊరేగింపుగా బయల్దేరి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశాఖ జిల్లా
విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అన్నపూర్ణ అవతారానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి హారతులిచ్చి, పూజలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో దుర్గాదేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. పుణ్యపు వీధిలో సీతారామచంద్ర మూర్తి సహిత అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో అమ్మవారికి అష్టోత్తర శత కలశాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా మంత్రాలయంలో శరన్నవరాత్రులు ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పూజల్లో భాగంగా గ్రామ దేవత మాంచాలమ్మను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు . తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లాలో దేవి నవరాత్రులు ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆలయాలు ఉత్సవశోభను సంతరించుకుని వెల్లివిరుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు... అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు..
ఇదీ చదవండి: durga gudi rush: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ