Deputy CM Kottu Satyanarayana's comments on BJP: విశాఖలో అమిత్ షా, కాళహస్తిలో నడ్డా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు చౌకబారు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. టీడీపీ సానుభూతిపరులైన నేతలను పక్కన పెట్టుకుని ఆ ఇద్దరూ మాట్లాడారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ప్రధాని మోదీ, అమిత్ షాల మధ్య విభేదాలు వచ్చినట్టు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. మోడీ నోటి వెంట జగన్కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాలేదని చెప్తూ.. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దాఖలాలు ఉన్నాయన్నారు. బీజేపీలో టీడీపీ కోవర్టులు చెప్పిన మాటలు నమ్మితే పోలవరం నిధులు రూ.13వేల కోట్లు, రెవెన్యూ లోటు కింద మరో 10 వేల కోట్ల రూపాయలు వస్తాయా అని ప్రశ్నించారు.
జగన్పై ఉన్న ప్రత్యేక అభిమానంతోనే ఆ డబ్బులు మోదీ విడుదల చేశారని వెల్లడించారు. గతంలో పోలవరం నిధులు ఏటీఎమ్ కింద వాడేస్తున్నారు అని స్యయానా మోదీ విమర్శలు చేశారన్నారు. తనకు ఉన్న అవగాహన మేరకు అమిత్ షా, మోదీల మధ్య విభేదాలు వచ్చాయని అనుకుంటున్నానని తెలిపారు. మోదీకి జగన్పై విశ్వాసం ఉండబట్టే నిధులు వచ్చాయని చెప్పారు. మహాజన సభలో మోడీని పొగడాల్సింది పోయి జగన్ను తిట్టారు. ఇలా తిడితే ఆంధ్రులు మెచ్చుకుంటారా అని ప్రశ్నించారు.
ఆంధ్రుల అనుకూల నిర్ణయాలేవీ.. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆంధ్రులు సంతోషిస్తారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ కలిస్తే.. జోగి, జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న చందాన కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీలో తెలుగుదేశం కోవర్టులు రాసిచ్చిన స్క్రిప్టునే అమిత్ షా చదివేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. అలా చదవడానికి ఆయనకు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. మోదీకి అమిత్ షాకు మధ్య గ్యాప్ ఉండబట్టే ఏపీ సీఎం జగన్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రచారం కోసం వారాహి యాత్ర చేసుకుంటే తమకేమీ ఇబ్బంది లేదని తెలిపారు. కొందరు యువత మాత్రమే ఆయన వెనుక వెళ్తారన్నారు. దేవాలయానికి భక్తుల రూపంలో ఎవరు వచ్చినా ఆంక్షలు ఏమీ ఉండవని వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో రాజకీయ ప్రచారాలు చేయడం నిషిద్ధమని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం.. అందుకే శాంతి భద్రతల గురించి జిల్లా ఎస్పీకి ఆలయ ఈవో లేఖ రాశారని పేర్కొన్నారు.