CYBER CRIME : ఓటీపీ అడగరు.. లింక్ క్లిక్ చేయమని చెప్పరు.. కానీ నమ్మకంగా యాప్ డౌన్‌లోడ్ చేయిస్తారు. ఆ తరువాత మన ఖాతా నుంచి డబ్బులు గుంజేస్తారు. రిమోట్ డెస్క్ యాప్‌ల సాయంతో నయా మోసాలకు తెర తీశారు సైబర్ నేరగాళ్లు. స్క్రీన్ షేర్, రిమోట్ యాప్‌లను వేరే ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు సరిచేసేందుకు సైబర్ నిపుణులు ఉపయోగిస్తుంటారు. వీటిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. మీ కరెంట్ బిల్లు చెల్లించలేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఉండాలంటే విద్యుత్ అధికారిని సంప్రదించండి అంటూ సందేశాలు పంపుతూ నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుడివాడలో ఇదే తరహా మోసాలు వెలుగు చూసినట్లు విజిలెన్స్ అధికారులు, నిపుణులు చెబుతున్నారు.
ఎనీ డెస్క్, టీం వీవర్ లాంటి యాప్‌లను చరవాణిలో డౌన్‌లోడ్ చేసి క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే చరవాణి సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మన చరవాణిలో ఏం చేసినా.. వారి ల్యాప్‌టాప్‌లో కనిపిస్తుందంటున్నారు. అలా ఐడీ, పాస్‌వర్డ్ లను తెలుసుకుని సొమ్ము అంతా దోచేస్తారని హెచ్చరిస్తున్నారు.
కరెంట్ బిల్లులకు సంబంధించి అపరిచిత వ్యక్తులు యాప్‌లు డౌన్‌లోడ్ చేయమంటే నమ్మవద్దని విద్యుత్ విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. బిల్లు చెల్లించకపోతే నియమిత గడువు దాటిన తరువాత లైన్‌మెన్ లేదా విద్యుత్ సిబ్బంది వచ్చి నోటీసులిస్తారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: