రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లోపు తెదేపా హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే లబ్ధిదారులతో సీపీఐ పార్టీ తరఫున గృహప్రవేశం చేయిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను జిల్లా కార్యదర్శి అక్కినేని వనజతో కలిసి ఆయన పరిశీలించారు. తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను.. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాదైనా లబ్ధిదారులకు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018లో తెదేపా ప్రభుత్వం అర్హులైన పేదలకు పీఎంఏవై పథకం కింద మొదటి విడతలో 1,504 మందికి, రెండో విడతలో 1,920 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిందని రామకృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.500, రూ.12,500, రూ.25,000 డీడీల రూపంలో కట్టించుకుని ప్లాట్లు కేటాయించారని రామకృష్ణ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో రహదారులు, మౌలిక వసతులు లేవని అన్నారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..