కరోనా మహమ్మారి పట్ల ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన సీఎం జగన్మోహన్రెడ్డి పలుమార్లు తేలికగా వ్యాఖ్యలు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తొలుత పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్లతో పోతుందని... మరోసారి సహజీవనం చేయాలని.. ఇంకోసారి కరోనా అందరికీ వస్తుందంటూ వ్యాఖ్యానించారని అన్నారు. స్వయాన ముఖ్యమంత్రే కరోనాను తేలికగా తీసుకున్నారని.. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రజల నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఫలితంగా కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిందన్నారు.
కరోనా రోగులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని విమర్శించారు. కరోనాకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలు చేయటం లేదన్నారు. కరోనా వైద్యం పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని.. రాష్ట్రంలో వైద్యంపై నమ్మకం లేక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలే పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతికి, 4,487 మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ప్రజల ప్రాణలను గాలికి వదిలేసి, కరోనా కట్టడిని పక్కన పెట్టి, తన ఎజెండా అమలుకే జగన్మోహనరెడ్డి మొగ్గుచూపుతున్నారని ఆరోపించారు. పలు వివాదాస్పద అంశాలకు తావిస్తున్నారని అన్నారు. కరోనా నిరోధానికి చర్యలకై కేంద్ర ప్రభుత్వం హైదరాబాదుకు బృందాన్ని పంపిందని.. రాష్ట్రంలో విపరీతంగా కరోనా ఉదృతి కొనసాగుతున్నప్పటికీ కేంద్ర బృందం పర్యటించకపోవడంలో లాలూచీ ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, కరోనా కట్టడికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని, కేంద్రం ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు