కోటిమంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలో అంత్యక్రియలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎవరైనా చనిపోతే మామూలు రోజుల్లోనే అంతిమ సంస్కారాలు ఖరీదైన వ్యవహారంగా మారిపోగా ..ఇప్పుడు కరోనా భయంతో కొత్త చిక్కులు ఏర్పడుతున్నాయి. శ్మశానవాటికల్లో స్థానికేతరులకు అనుమతులు ఇవ్వట్లేదు. ఇది అమానవీయమని, విషాదంలో ఉన్న కుటుంబాలను మరింత కుంగదీయడమేనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని శ్మశాన వాటికల్లో కొవిడ్ రోగుల మృతదేహాల అంత్యక్రియలకు అనుమతించాలని బల్దియా రెండు నెలల కిందటే ఆదేశాలు జారీ చేసింది. కానీ స్థానిక కమిటీలు దీనికి ససేమిరా అంటున్నాయి.
ఆయనో విశ్రాంత న్యాయమూర్తి. కరోనాతో మృతి చెందారు. బంధువులు దహన సంస్కారాల కోసం ఓ శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. స్థానికులు ఒప్పుకోలేదు. చివరకు అధికారుల జోక్యంతో ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.
ప్రైవేటు నిర్వహణే కారణమా?
నగరంలో అత్యాధునిక శ్మశానవాటికల ఏర్పాటులో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) విఫలమైంది. మొత్తం 896 శ్మశానవాటికలుంటే, వాటిలో ఏ ఒక్కటీ బల్దియా నిర్వహణలో లేవు. స్థానిక కాటికాపరి, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే అవి నడుస్తున్నాయి. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేవు. రెండేళ్ల కిందట నగరంలోని శ్మశానాల అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ దాదాపు రూ. 25 కోట్లు వినియోగించింది. కొన్నింటిని ప్రైవేటు స్థలాల్లో అభివృద్ధి చేసింది. శ్మశానాలన్నీ కూడా ప్రైవేటు సంస్థలు, కమిటీలే నిర్వహిస్తున్నాయి. దీంతో వారి ఇష్టానుసారంగా మారింది. కొన్నిచోట్ల పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తున్నారు. బన్సీలాల్‌పేట, అంబర్‌పేట, సనత్‌నగర్‌లలో బల్దియా ఎంతో సొమ్ము వెచ్చించి విద్యుత్తు దహనవాటికలను నిర్మించినా స్థానికుల అభ్యంతరాలతో అవి మూలనపడ్డాయి. షేక్‌పేట నాలా దగ్గర ఓ ప్రైవేటు సంస్థ నిర్వహణలో ‘మహాప్రస్థానం’ పేరుతో అత్యాధునిక విద్యుత్తు దహనవాటికతో పాటు సాధారణ శ్మశానవాటిక కూడా ఉంది. చాలామందికి అక్కడే అంత్యక్రియలు చేస్తున్నారు.
ప్రతిపాదనలు ఇచ్చినా...
కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ బాహ్యవలయ రహదారి(ఓఆర్ఆర్) వద్ద నాలుగు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఒక్కోచోట 20 ఎకరాలను తీసుకుని అన్ని వర్గాలకు ఇక్కడ వేర్వేరు వాటికలను ఏర్పాటు చేయాలని భావించారు. అయతే కొవిడ్ కోసం ప్రత్యేకంగా మరుభూములను ఏర్పాటు చేస్తే జనంలో ఆందోళన రేగుతుందన్న ఉద్దేశంతో సర్కార్ తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
ఐసీఎంఆర్ ఏం చెప్పింది?
కొవిడ్ రోగుల మృతదేహాలను దహనం చేయడం వల్ల ఎటువంటి ముప్పు ఉండదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. మృతదేహాన్ని తాకకుండా అంత్యక్రియలను పూర్తిచేసుకోవాలి. మృతదేహానికి స్నానం చేయించడం వంటివి చేయకూడదు. అంతిమ క్రతువు కోసం చితాభస్మాన్ని సేకరించవచ్చు. దానినుంచి ఎటువంటి ఇన్‌ఫెక్షన్ రాదు.
నగరంలోని శ్మశానవాటికల్లో కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి అంగీకరించపోవడం వల్ల జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్వాహకులకు, స్థానికులకు నచ్చజెప్పి దహన సంస్కారాలు జరిగేలా చూస్తున్నారు. కొవిడ్ మృతదేహాలను తగిన జాగ్రత్తలతో దహనం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. - బొంతు రామ్మోహన్, హైదరాబాద్ మేయర్
మృతదేహాన్ని దహనం చేసినప్పుడు వైరస్ అంతమైపోతుంది. అందుచేత దహన ప్రక్రియ వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది అపోహ మాత్రమే. చితాభస్మంలో కూడా ఎటువంటి వైరస్ ఉండదు. - డాక్టర్ శివరాజ్, ఫిజీషియన్
కరోనా తెచ్చిన తంటా..
కరోనా వైరస్‌తో చనిపోయిన వారిని 108 వాహనంలో తెస్తే చాలు స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల కొవిడ్‌తో చనిపోయిన ఇద్దరిని దహనం చేయడానికి మూడు శ్మశాన వాటికలకు తిరిగితే ఎవరూ ఒప్పుకోకపోవడంతో చివరికి రోగి బంధువులు రంగారెడ్డి జిల్లాలోని బహిరంగ ప్రదేశాల్లో అంత్యక్రియలు పూర్తిచేయాల్సి వచ్చింది. గత మూడు నెలల్లో నగరానికి చెందిన దాదాపు వందమంది కరోనాతో మృతి చెందారు. వీరిలో చాలామంది బంధువులు స్థానికులను అతి కష్టం మీద ఒప్పించి దహనం చేయాల్సి వచ్చింది. ఈఎస్‌ఐ వద్ద శ్మశాన వాటిక నిర్వాహకులు మాత్రం కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నారు. స్థానికేతరులైతే విధిలేక శివార్లకు తీసుకువెళ్తున్నారు.
స్ఫూర్తి చాటిన విజయ్‌కాంత్
చెన్నైలోనూ కొవిడ్ మృతుల అంత్యక్రియలకు శ్మశానాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. స్పందించిన తమిళనాడు సినీ, రాజకీయ ప్రముఖుడు విజయకాంత్ చెన్నై నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న తన భూమిని కొవిడ్ మృతుల అంత్యక్రియలకు దానమిచ్చారు. శవాలను ఖననం లేదా దహనం చేశాక వైరస్ చనిపోతుందని, అపోహలను ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి. అమాయకులను నమ్మబలుకుతాడు... అందినకాడికి దోచుకుంటాడు