పశ్చిమగోదావరిలో కరోనా నిర్ధారణ అయిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పడకలు ఖాళీ లేవంటూ కొవిడ్ ఆసుపత్రుల ముందే తమను నిలిపేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. పాజిటివ్ వచ్చిన 80 మందిని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 23వ తేదీ సాయంత్రం తాడేపల్లిగూడెం కొవిడ్ కేర్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. రాత్రి 12 గంటల దాకా వారిని లోనికి అనుమతించలేదు. కనీసం భోజన సౌకర్యమూ కల్పించలేదు. అర్ధరాత్రి దాకా బస్సులోనే వేచి చూడాల్సిన పరిస్థితి. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులే అధికం. తాజాగా గురువారమూ అలాంటి సంఘటనే పునరావృతమైంది. 47 మంది బాధితులను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించేందుకు స్థానిక సిబ్బంది ఏలూరులో మధ్యాహ్నం 12 గంటలకు బస్సు ఎక్కించారు. సాయంత్రం 5 గంటల వరకూ బస్సు కదల్లేదు. జిల్లాలోని కొవిడ్ సెంటర్లు ఖాళీ లేనందునే బస్సు కదల్లేదని చెబుతున్నారని, బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల పాజిటివ్ వచ్చిన 14 మందిని చింతలపూడి నుంచి ఏలూరు తరలిస్తుండగా ఒక వృద్ధుడు మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహాన్ని ఏలూరు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారుగానీ బస్సులోని మిగతా వారిని పట్టించుకోలేదు. వారు రాత్రి 11 గంటల వరకూ రోడ్డుపైనే కూర్చుండిపోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లుల్లో కొవిడ్ ఆసుపత్రులు, కేర్ సెంటర్లు సేవలందిస్తున్నాయి. వాటిలో ప్రస్తుతం 2,136 మంది బాధితులు ఉన్నారు. జిల్లాలో ఇంకా వెయ్యి పడకల వరకూ ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇన్ని ఖాళీలున్నా ఆసుపత్రులకు తరలించడంలో, చేర్చుకోవడంలో జాప్యం ఎందుకని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
కారణాలు తెలుసుకుంటాం:
జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్‌లలో ఖాళీలున్నాయి. జరిగిన సంఘటనల్లో జాప్యానికి కారణం తెలుసుకుంటాం. ఒకటి రెండు రోజుల్లో జిల్లా ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
- శంకరరావు, డీసీహెచ్‌ఎస్
అసెంబ్లీ, సచివాలయాల్లో మరో ముగ్గురికి..
అసెంబ్లీ, సచివాలయాల్లో మరో మూడు కేసులొచ్చాయి. ఈనెల 20న చేసిన పరీక్షల ఫలితాల్లో బుధవారం సాయంత్రం ఇద్దరికి, గురువారం ఉదయం ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
పాయకరావుపేట ఎమ్మెల్యేకు పాజిటివ్
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబూరావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా వైకాపా నాయకులు, కార్యకర్తలకు వాట్సప్ ద్వారా తెలిపారు.
అత్యాచార బాధిత బాలికకు...
ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన బాలికకు గురువారం కరోనా నిర్ధారణ అయిందని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందరరావు తెలిపారు. ఈ అత్యాచార ఘటనలో పోలీసులు 12 మంది నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. అదేరోజు కోరుకొండ పోలీసుస్టేషన్‌లో పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్, మిగిలినవారికి నెగెటివ్ వచ్చింది.
ఇదీ చూడండి.