కృష్ణా జిల్లాలో మొత్తం 367 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 14 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు దశల వారీగా చికిత్స పొందుతూ ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళుతున్నారు. శుక్రవారం వరకు 130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం 80 మంది కోలుకుని ఇంటికి వెళ్లినందున.. ప్రస్తుతం 62 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా కొవిడ్ ఆసుపత్రి నుంచి 24 మంది, గన్నవరం పిన్నమనేని ఆసుపత్రి నుంచి 56 మంది డిశ్చార్జి అయిన వారిలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 367 బాధితుల్లో 291 మంది కోలుకోవటంతో రికవరీ శాతం 79.5గా ఉంది. ఇది రికార్డుగా చెబుతున్నారు.
కొత్తగా మరో 7 కేసులు..!
జిల్లాలో మరో 7 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. సామాజిక వ్యాప్తి ద్వారా ఇవి సంక్రమించాయి. వారిని గుర్తించి కొవిడ్ ఆసుపత్రికి, కటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 7 కేసుల్లో 5 గొల్లపూడి ప్రాంతంలో వచ్చాయి. ఇటీవల ఒక వ్యక్తికి కరోనా సోకి ఇబ్రహీంపట్నంలో మృతి చెందారు. ఆయన భార్యకు, కుమారుడికి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. గొల్లపూడి ప్రాంతానికి చెందిన మరో మహిళకు సోకింది. తమ బంధువు నుంచి ఆమెకు వచ్చింది. ఇటీవల ఓ వృద్ధురాలు వైరస్‌తో మరణించటంతో అంత్యక్రియలకు వెళ్లిన ఇద్దరు సమీప బంధువులకు వైరస్ సోకింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన తల్లీ కొడుకులూ వైరస్ బారిన పడ్డారు. ఓ మాస్టర్ ద్వారా వీరికి వ్యాపించినట్లు చెబుతున్నారు.
'కృష్ణా బృందం సాధించిన విజయమిది'
'ఒకే రోజు కరోనాను జయించి 80 మంది ఇంటికి క్షేమంగా చేరడం ఆనందాన్ని ఇచ్చింది. ఇది టీం కృష్ణా చేస్తున్న యుద్ధంలో విజయం. అధికారులు, వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా భావిస్తున్నాం. సీఎం ఆదేశాల ప్రకారం కోలుకున్న వారికి రూ.2 వేలు చొప్పున ఇచ్చి ఇంటికి పంపించాం. కరోనాతో చేస్తున్న ఈ యుద్ధానికి ప్రజలు సహకరించాలి. లాక్‌డౌన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. మరికొన్ని రోజులు సహనంతో ఉంటే ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది.' --- ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్
ఇవీ చదవండి.. విజయవాడ శివారులో పేదలకు నివేశన స్థలాలు!