కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలంలోని కోసురువారిపాలెం, నాగాయతిప్ప, మోపిదేవిలంక, ఉత్తర చిరువోలు లంక గ్రామాలు, చల్లపల్లి మండలం నడకుదురు గ్రామాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తారు. సారవంతమైన నేలలు ఉండటం, భూగర్బ జలాలు పుష్కలంగా ఉండటంతో సుమారు 10 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయి. టమాటా, దొండ, వంగ, బెండ, కాకర, సొర, బొప్పాయి, క్యాబేజీ, పచ్చిమిర్చి, అరటి, కంద, పసుపు పంటలు పండిస్తారు. పండించిన పంటను విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ మార్కెట్లకు, రైతు బజార్లకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అలానే టమాటా, పచ్చిమిర్చి వంటివాటిని చెన్నై, ముంబయి, హైదరాబాద్ నగరాలకు ఎగుమతి చేస్తారు.
లాక్ డౌన్ రైతులను ముంచింది
కరోనా మహమ్మారి అంతా తలకిందులు చేసింది. లాక్ డౌన్ కారణంగా రవాణా లేక ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానికంగానూ మార్కెట్ లేక పండిన పంటను నదిలో పారబోస్తున్నారు రైతన్నలు. మరికొందరు పొలంలోనే దున్నేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వారాంతపు సంతలు జరిగేవి. చాలామంది అక్కడకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసేవారు. లాక్ డౌన్ కారణంగా అవీ మూతబడ్డాయి.
కూరగాయలు వదిలేసి వాణిజ్య పంటలవైపు చూపు
ఈ క్రమంలో కాయగూరల సాగంటేనే అన్నదాతలు భయపడుతున్నారు. కొవిడ్ ఎప్పుడు పోతుందో, మళ్లీ సాధారణ జీవనం మొదలై మార్కెట్లు ఎప్పుడు కళకళలాడతాయో తెలియని సందిగ్ధంలో పడ్డారు రైతులు. అందుకే చాలామంది కూరగాయల సాగు వదిలేసి పసుపు, కంద వంటి వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలానే కొనసాగితే భవిష్యత్తులో కాయగూరలకు కరవొచ్చే పరిస్థితి ఎదురవ్వొచ్చు.
వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు కూరగాయలు ఎక్కువగా పండించే గ్రామాల్లో పర్యటించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఏ పంటలకు ఎక్కడెక్కడ మార్కెటింగ్ సౌకర్యాలు ఉంటాయో, ఏ విధమైన రాయితీలు ఉంటాయనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. వివిధ అంశాలపై తమకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రైతులు కోరారు.
ఇవీ చదవండి...