కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో.. ఇప్పటికీ ప్రయాణికుల రిక్షాలు వినియోగిస్తున్నారు. 50 ఏళ్లుగా సుమారు 300 మంది వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నిరంతరం శ్రమిస్తేనే రిక్షా కార్మికులకు పూట గడిచేది. ఆటోలు అందుబాటులోకి వచ్చాక రిక్షాలకు గిరాకీ తగ్గింది. అయినా ఎవరో ఒకరు రిక్షా ఎక్కుతారని ఆశగా ఎదురుచూస్తూ దాన్నే నమ్ముకుని బతుకుతున్నారు.
రిక్షా కార్మికులు కష్టాన్నే నమ్ముకుని.. రక్తాన్నే ఇంధనంగా మార్చి రిక్షా నడుపుతున్నారు. ప్రయాణికుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.. రోజంతా ఒక్క గిరాకీ కూడా రాక వట్టి చేతులతో ఇంటికెళ్లిన రోజులూ ఉంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ ఆంక్షల వల్ల నెలల తరబడి ప్రయాణికులు లేక.. రిక్షాలు మూలనపడటంతో ఇప్పుడు నడపటానికి వీల్లేకుండా తయారయ్యాయని చెబుతున్నారు.
అసలే ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రిక్షాల మరమ్మతులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని రిక్షావాలాలు అంటున్నారు. చేతి వృత్తుల వారిని ఆదుకున్నట్లే.. తమకూ ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: