కూలీల్లో కరోనా వైరస్ భయం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పనులకు హాజరయ్యేందుకు వీరు వెనుకడుగు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో లక్ష్యానికి మించి పని దినాలు ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కూలీల హాజరులో తగ్గుదల కనిపిస్తోంది. ఏటా ఏప్రిల్‌లో రోజూ 15 లక్షల నుంచి 17 లక్షల మంది కూలీలు హాజరయ్యేవారు. ప్రస్తుతం 5 నుంచి 7 లక్షల హాజరు గగనమవుతోంది. గత 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 12.20 లక్షల పని దినాలనే ఉపయోగించుకున్నారు. గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో 210.21 లక్షల పనిదినాలను వినియోగించుకున్నారు.
కూలీలు హాజరుకాకపోవడానికి మరికొన్ని ఇతర కారణాలు
* ఆటోల నిలిపివేత
* గుంపులుగా పని చేయడాన్ని అనుమతించకపోవడం
* మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో లేకపోవడం
ఇళ్లకే పరిమితమవుతున్న కూలీలు
కేసుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో అత్యధిక చోట్ల కూలీలు ముందు జాగ్రత్తగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రత్యేకించి చిత్తూరు, విశాఖపట్నం, కడప, కర్నూలు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సిబ్బంది చెబుతున్నా స్పందన లేకపోవడంతో గత 15 రోజుల్లో నామమాత్రంగా పనులు నిర్వహించారు.
ఇవీ చదవండి