కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లాక్డౌన్ సడలింపులు వచ్చినా ఉత్పత్తి అంతంతమాత్రమే జరుగుతుంది. మూతపడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభమైనా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని వివిధ పారిశ్రామిక వాడల్లో దాదాపు వెయ్యికి పైగానే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలున్నాయి. నూజివీడు పారిశ్రామికవాడలోని దాదాపు 20కు పైగా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలుంటే అవన్నీ ఒకదానికి ఒకటి అనుబంధంగా పనిచేసేవే.
నిర్మాణ రంగం ప్రభావం
ముడి సరకు, మార్కెట్ లేమి ప్రధాన సమస్యగా మారాయి. నిర్మాణ రంగానికి అనుబంధంగా పనిచేసే పరిశ్రమలు కొవిడ్‌కు ముందు నుంచే డీలా పడ్డాయి. ఇసుక, ఇతరత్రా సమస్యలతో నిర్మాణరంగం ఆశాజనకంగా లేకపోవటంతో వీటికి అనుబంధంగా నడిచే పరిశ్రమలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కరోనా ప్రభావంతో 3 నెలలుగా ఈ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్‌కి ముందు ఆర్డర్లపై ప్రభావం పడితే సడలింపులు వచ్చాక కార్మికుల కొరత, రవాణా, అనుబంధ పరిశ్రమలపై పెరిగిన సిమెంట్ ధరలు, ఇతర ఖర్చులు ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావట్లేదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలకు అనుగుణంగా బ్యాంకర్ల నుంచి సరైన సహకారం లేదని చెప్తున్నారు.
అప్పుపై వడ్డీ రేట్లు తగ్గించటం, కొంతకాలం వివిధ రకాల పన్నుల రద్దు వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వెసులుబాటు ఉంటుందని పారిశ్రామిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆగిపోయిన వివిధ రకాల నిర్మాణాలు తిరిగి ప్రారంభమైతేనే ఆ రంగానికి అనుబంధంగా పనిచేసే పరిశ్రమలకు తోడ్పాటు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ పరిశ్రమల పనిచేసేవారిలో ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ మంది ఉంటటం వల్ల కార్మికుల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. చాలా మంది వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లిపోవటంతో ఆర్డర్లు ఉన్నా ఉత్పత్తి ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని పరిశ్రమలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన విజయవాడ నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో లాక్డౌన్ నిబంధనలు మళ్లీ కఠినతరం చేస్తుండటంతో ఆ ప్రభావం పరిశ్రమలపై పడుతుందని పారిశ్రామిక వేత్తలు అంటున్నారు.
ఇదీ చదవండి:
సైబర్ క్రైమ్ : ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే అంతే సంగతి... బ్యాంకు ఖాతా ఖాళీ