కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం 10గంటల వరకూ జిల్లాలో 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో విజయవాడ నగరంలోనే 10 కేసులు నమోదయ్యాయి. నున్న, నూజివీడుల్లో ఒక్కొక్కటి చొప్పున రికార్డ్ అయ్యాయి. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 258కు పెరిగింది. వీటిలో 218 కేసులు విజయవాడ నగరంలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 40 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే విజయవాడ నగరం మొత్తాన్ని రెడ్‌జోన్ పరిధిలో పెట్టి.. లాక్‌డౌన్ ఆంక్షలు పెట్టినా.. జనంలో మార్పు రావడం లేదు. ఉదయం వేళ నిత్యావసర సరకుల కోసం ఇచ్చిన 3 గంటల సమయంలో పెద్ద ఎత్తున రహదారులపైకి వస్తున్నారు. వీరి రాకతో రహదారులపై ట్రాఫిక్ సైతం కొన్నిచోట్ల స్తంభించే పరిస్థితి ఉంటోంది. ఇప్పటికీ చాలామంది భౌతిక దూరం పాటించడం లేదు. ఇదే... కేసుల ఉద్ధృతికి ప్రధాన కారణంగా మారుతోంది. శనివారం వచ్చిన కొత్త కేసుల్లోనూ.. 7 కృష్ణలంకలో, ఒకటి కార్మికనగర్‌లో వెలుగుచూశాయి. చిట్టినగర్, సింగ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
ఆసుపత్రుల్లో 206 మందికి చికిత్స
విజయవాడలో ఉన్న కొవిడ్ రీజినల్ చికిత్సా కేంద్రం, చిన అవుటుపల్లిలో ఉన్న జిల్లా కరోనా ఆసుపత్రుల్లో ప్రస్తుతం 206మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 8 వైరస్‌తో మృతి చెందారు. 44 మంది ఆసుపత్రుల నుంచి ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి అయ్యారు. వీరిలో ఆరుగురు చినఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ నుంచి శుక్రవారం రాత్రి ఇళ్లకు వెళ్లారు.
ఇవీ చదవండి: