NEW YEAR LIQUOR SALES IN VIJAYAWADA : నూతన సంవత్సర సంబరాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి వరకూ హంగామా చేశారు. కొందరు ఇళ్లల్లో, మరికొందరు కాలనీల్లో విందు, వినోద కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. అపార్ట్‌మెంటు వాసులు స్థానికంగా పలు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఆనందోత్సాహాలతో గడిపారు.
ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో అర్ధరాత్రి వరకు చిందులేశారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ హడావుడి ఎక్కువగా కనిపించింది. నూతన సంవత్సర వేడుకల్లో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే జిల్లా వాసులు రెట్టింపు తాగారు. 31న రాత్రి ఒక్క రోజే రెండు జిల్లాల్లో రూ.36 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గుడివాడ, నిడమానూరు, గొల్లపూడిలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయాలు జాతరను తలపించాయి.
కొత్త ఏడాదిలో మద్యం ప్రియుల సరికొత్త రికార్డు - కిక్ ఇస్తున్న ఎక్సైజ్ శాఖ గణాంకాలు
రెండు జిల్లాల్లో 236: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మద్యం దుకాణాలు, బార్లు, స్టార్ హోటళ్లు 236 ఉన్నాయి. నూతన సంవత్సరం వేడుకలు పురస్కరించుకుని నిబంధనలను సడలించి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. రోజూ జరిగే విక్రయాల కంటే రెట్టింపు స్థాయిలో నమోదయ్యాయి. రెండు జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో 39,481 ఐఎంఎఫ్‌ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) కేసులు విక్రయించారు. 10,006 బీరు కేసులు లాగించేశారు. వీటి విలువ రూ.36.74 కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెట్టారు. 31న సాయంత్రం నుంచే మద్యం దుకాణాల వద్ద మందుబాబుల హడావుడి నెలకొనగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. పోలీసులు వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. విజయవాడలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్లకు తరలించారు.
రాత్రంతా ఏరులై: పలు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రధానంగా మద్యం వినియోగించే ఉత్సవాలకు ఎక్సైజ్ అధికారుల అనుమతి లభించడం విశేషం. విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని నాలుగుచోట్ల మద్యంతో ప్రమేయం ఉన్న వేడుకలు జరిగాయి. ఉత్సవాల్లో పాల్గొనే వారు ముందే డబ్బు చెల్లించి టిక్కెట్లు కొనగా అర్ధరాత్రి వరకు మద్యం ఏరులై పారింది. విందు భోజనం, మద్యం ఉన్న చోట్ల ఎక్కువ ధర నిర్ణయించినా పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.