AP Cabinet Meeting: అమరావతిలో 2 వేల 733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్టసవరణ చేసింది.
పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదించింది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్‌ఐపీబీ ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు అమోదించింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం అమోదం తెలిపింది.
Minister Kolusu Parthasarathy Comments: కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. గతంలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉందని, హడ్కో తదితర వాటితో కలిసి అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించామని అన్నారు. రూ.2,723 కోట్లతో రెండు ఇంజినీరింగ్ పనులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు గత టెండర్లు రద్దు చేశామని, కొత్తగా టెండర్లు పిలవాలన్న సూచనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులకు ముందుకు రాని పరిస్థితి ఉండేదని, పెట్టుబడులు పెట్టిన సంస్థలు సగంలో ఆపేసి వెళ్లిపోయానని ఆరోపించారు. గతంలో ఏపీలో పెట్టుబడులకు అంతర్జాతీయ బ్యాంకులు ముందుకు రాలేదని అన్నారు. ప్రస్తుతం కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామని, పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిదన్నారు. నంద్యాల, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో టాటా సంస్థ 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదించిందని అన్నారు. సౌరవిద్యుత్ ప్లాంటు ద్వారా రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, 1380 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని, రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని పేర్కొన్నారు. రిలయన్స్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలో బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు 40 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గుంటూరు జిల్లాలో వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి, క్వార్టర్ల కోసం భూమిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రికి ఆరెకరాలు, వైఎస్‌ఆర్ జిల్లాలో టీడీపీ ఆఫీస్‌కు రెండెకరాలు లీజు విధానంలో ఇవ్వడానికి నిర్ణయించామని అన్నారు.
రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు - 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర